సంజయ్ దత్ సినిమా.. ఆయన షాకయ్యాడు

సంజయ్ దత్ సినిమా.. ఆయన షాకయ్యాడు

చాలా తక్కువ సినిమాలతోనే గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు రాజ్ కుమార్ హిరాని. ఆయన ఒక్కో సినిమా ఒక్కో క్లాసిక్ అనే చెప్పాలి. తన సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడంతో పాటు ఎన్నో జీవిత సత్యాలు బోధించి ఆలోచన రేకెత్తించాడు హిరాని. అలాంటి ఇమేజ్ ఉన్న దర్శకుడు బ్యాడ్ బాయ్ గా గుర్తింపున్న సంజయ్ దత్ జీవిత కథను సినిమాగా తీస్తానన్నపుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. ఐతే ఈ ఆశ్చర్యం హిరానికి అత్యంత సన్నిహితుడైన నిర్మాత విధు వినోద్ చోప్రాకు కూడా కలిగిందట. ‘సంజు’ సినిమాకు నిర్మాతగా కూడా వ్యవహరించిన ఆయన.. దత్ కథను సినిమాగా తీసే ఆలోచనను వ్యతిరేకించారట. మరి ఈ సినిమాకు తాను ఎలా ఒప్పుకున్నదీ విధు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.


‘‘సంజయ్‌దత్‌ బయోపిక్‌ తెరకెక్కిస్తానని హిరాని చెప్పినప్పుడు సినిమా తీసేటంత గొప్ప విషయాలు సంజయ్‌ జీవితంలో ఏమున్నాయి అన్నాను. అతడి కంటే నా కథే బాగుంటుందని.. ఓ కుర్రాడు కాశ్మీర్‌ విడిచి ఏ పరిస్థితుల్లో ముంబయి వచ్చాడు.. ఇక్కడికొచ్చాక ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు..ఇదంతా ఆసక్తికరంగా ఉంటుంది అని చెప్పాను. నేనా మాట అంటే హిరాని షాకయ్యాడు. తర్వాత సీరియస్ గా సంజయ్‌ జీవితంలోని ఒక్కో అంశాన్నీ విపులంగా చెప్పాడు హిరాని. సంజయ్‌ జీవితంలో ఇన్ని మలుపులున్నాయా అని ఆశ్చర్యపోయాను. హిరాని చెప్పాలనుకున్నది గొప్ప కథ అని తర్వాత అర్థమైంది. కథ విని ఓకే చేశాక.. సంజయ్‌ పాత్రలో ఎవరు నటిస్తారు అని అడగ్గానే హిరాని రణ్‌బీర్ పేరు చెప్పాడు. నాకు నచ్చలేదు. రణ్‌వీర్‌ సింగ్‌ లాంటి నటుడైతే బాగంుటుందన్నాను. కానీ రణ్‌బీరే ఆ పాత్రకు కరెక్ట్ అని హిరాని నమ్మాడు. అయిష్టంగానే ఒప్పుకున్నాను. కానీ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకు సంజయ్‌ పాత్రలోకి రణ్‌బీర్‌ పరకాయ ప్రవేశం చేసిన తీరు చూసి నా నోట మాట రాలేదు’’ అని విధు వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు