ఇలియానా ఉందని తమన్ కన్పమ్ చేశాడు

ఇలియానా ఉందని తమన్ కన్పమ్ చేశాడు

దేవుడు చేసిన మనుషులు సినిమా రిలీజై ఆరేళ్లవుతోంది. ఆ సినిమా తర్వాత ఇలియానా తెలుగు సినిమాల వైపే చూడలేదు. బాలీవుడ్‌కు వెళ్లిపోయి అక్కడే సెటిలైపోయింది ఈ గోవా భామ. మధ్యలో కొన్ని ఆఫర్లు వచ్చినా తిరస్కరించింది. అది చాలదన్నట్లు తెలుగు సినిమాల్ని తక్కువ చేసి కూడా మాట్లాడింది. మళ్లీ ఇటువైపు చూసే ఉద్దేశమే ఆమెకు లేనట్లుగా కనిపించింది. కానీ ఆశ్చర్యకరంగా ఇప్పుడు ఇలియానా మళ్లీ ఓ తెలుగు సినిమాలో నటిస్తున్నట్లుగా గుసగుసలు వినిపించాయి. తన మిత్రుడు రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో ఇలియానా నటిస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఆ విషయంలో అధికారిక సమాచారం ఏదీ బయటికి రాలేదు. ఇలియానా నిజంగానే ఈ సినిమాలో నటిస్తోందని ఇప్పుడు కన్ఫమ్ అయింది.

రవితేజ-వైట్ల సినిమాకు సంగీత దర్శకుడిగా పని చేస్తున్న తమన్ ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. ఈ సినిమాలోకి వెల్కమ్ అంటూ ఇలియానాకు అతను స్వాగతం చెప్పాడు ట్విట్టర్లో. అంతే కాదు.. ఈ చిత్రానికి ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ అనే టైటిల్ అనుకుంటున్న విషయాన్ని కూడా పరోక్షంగా ధ్రువీకరించాడు తమన్. దీనికి ‘ఎఎఎ’ అనే హ్యాష్ ట్యాగ్‌ను అతను జోడించాడు. నిజానికి ఈ చిత్రంలో మలయాళ కుట్టి అను ఇమ్మాన్యుయెల్ ఒక కథానాయికగా నటించాల్సింది. కానీ డేట్ల సమస్యతో ఆమె సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలోకే ఇలియానా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో మరో కథానాయికకు కూడా చోటున్నట్లు సమాచారం. ప్రస్తుతం అమెరికాలో ఈ చిత్రం లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు