సంజయ్ దత్ గడ్డం గీయించుకోన్న వేళ..

సంజయ్ దత్ గడ్డం గీయించుకోన్న వేళ..

బాలీవుడ్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా విడుదలకు సమయం దగ్గర పడింది. గ్రేట్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో సంజయ్ దత్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘సంజు’ ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రోమోలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు రేకెత్తించాయి. విడుదల దగ్గర పడుతున్న సమయంలో ప్రమోషన్ల జోరు పెంచాడు దర్శక నిర్మాత హిరాని. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ తాను సినిమాలో అబద్ధాలు, అతిశయోక్తులు ఏమీ చూపించలేదని.. సంజు జీవితాన్ని యథాతథంగా చూపించే ప్రయత్నం చేశానని వెల్లడించాడు. సంజు జీవితంలో ఎన్నో ఆసక్తికర ఘట్టాలు ఉన్నాయని ఆయన తెలిపాడు. ఈ సందర్భంగా సంజయ్ దత్ జైల్లో ఉండగా జరిగిన ఒక ఆసక్తికర ఘటనను ఆయన మీడియాతో పంచుకున్నాడు.

సంజయ్ ఉన్న జైల్లో ఖైదీలందరికీ జుట్టు కత్తించడానికి, గడ్డం తీయడానికి ఒక ఖైదీనే నియమించారట. ఒక రోజు సంజయ్‌కి అతను షేవింగ్ చేస్తుండగా.. అతడి నేపథ్యం గురించి అడిగాడట. జైలుకు ఎందుకు వచ్చావని ఆరా తీశాడట సంజయ్. తన భార్యను కత్తితో పొడిచానని.. అందుకే జైల్లో వేశారని చెప్పాడట ఆ వ్యక్తి. దీంతో సంజయ్ బెదిరిపోయాడట. అతడితో గడ్డం గీయించుకోవడానికి నిరాకరించాడట. జైలు అధికారులు ఎంత చెప్పినా వినలేదట. జైలు నుంచి విడుదలయ్యాక తాను ఒక సినిమాలో గడ్డంతో కనిపించాల్సి ఉంటుందని.. కాబట్టి తనకు షేవింగ్ అవసరం లేదని చెప్పేశాడట. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాల్ని సినిమాలో చూపించినట్లు హిరాని వెల్లడించాడు. సంజయ్ దత్ పాత్రలో రణబీర్ కపూర్ నటించిన ఈ చిత్రంలో దియా మీర్జా.. సోనమ్ కపూర్.. పరేష్ రావల్.. మనీషా కొయిరాలా తదితరులు కీలక పాత్రలు పోషించారు.