ఈ హీరో చాలా క్రియేటివ్ అబ్బా..

ఈ హీరో చాలా క్రియేటివ్ అబ్బా..

ఓపెనింగ్సే సినిమాల ఫలితాల్ని నిర్దేశిస్తున్న ఈ రోజుల్లో హీరోలకు ఫ్యాన్ బేస్ అనేది చాలా కీలకం. అభిమానుల్ని సంపాదించుకోవడం ఒకెత్తయితే.. వాళ్లను మేనేజ్ చేయడం.. నిలబెట్టుకోవడం.. మరింతగా ఫాలోయింగ్ పెంచుకోవడం మరో ఎత్తు. ఈ విషయంలో ప్రతి హీరో కూడా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు.

సోషల్ మీడియా ద్వారా అభిమానులతో నిత్యం కనెక్టయి ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం ప్రత్యేకంగా సిబ్బందిని నియమించుకుని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో సంధానమై ఉండేందుకు.. నిరంతంగా ఏదో ఒక యాక్టివిటీ నడిపించేందుకు ప్రయత్నిస్తున్నారు హీరోలు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా ‘పెళ్ళిచూపులు’.. ‘అర్జున్ రెడ్డి’ లాంటి సినిమాలతో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న విజయ్ దేవరకొండ కూడా ఈ విషయంలో జాగ్రత్తగానే ఉంటున్నాడు.

తన అభిమానుల్ని రౌడీలని పిలిచే విజయ్.. వాళ్లతో నిరంతరం సోషల్ మీడియా ద్వారా కనెక్టయి ఉండేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందుకోసం తనదైన శైలిలో ఏదో ఒక డిఫరెంట్ యాక్టివిటీ ట్రై చేస్తుంటాడు. తాజాగా అతను ‘అర్జున్ రెడ్డి’లో నటనకు గాను ఉత్తమ నటుడిగా ఫిలిం ఫేర్ అవార్డు తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి వెళ్లేముందు అతను తన అభిమానుల్లో ఒకరిని ప్రత్యేక అతిథిగా ఎంపిక చేసుకున్నాడు. ఆ అభిమాని పేరు ప్రశాంత్. ట్విట్టర్ ద్వారా అతడిని సెలక్ట్ చేసిన విజయ్.. అతడిని తన ఆఫీసుకు రప్పించి తన పర్సనల్ స్టైలిస్టుతో అతడికి మేకప్ చేయించాడు. తనలాగే అతడికి సూటు కూడా కుట్టించాడు. ఇద్దరూ ఒకే రకంగా తయారై ఫిలిం ఫేర్ అవార్డుల వేడుకకు వెళ్లారు.

అక్కడ అందరికీ ప్రశాంత్‌ను పరిచయం చేయించి.. అతడిని మీడియాతో కూడా మాట్లాడించాడు. ఈ యాక్టివిటీ మొత్తాన్ని వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. అభిమానులతో అనుసంధానమయ్యే విషయంలో విజయ్ చూపించిన ఈ క్రియేటివిటీ చూసి అందరూ శభాష్ అంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు