హ్యాపీ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెలొస్తోంది

హ్యాపీ న్యూస్.. ఆ సినిమాకు సీక్వెలొస్తోంది

భారతీయ సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమాల్లో ‘3 ఇడియట్స్’ ఒకటి. ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు అటు కమర్షియల్‌గానూ గొప్ప విజయం సాధించిందా చిత్రం. 2009లో విడుదలైన ఈ చిత్రం ఆ సమయానికి ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. దాదాపు రూ.400 కోట్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది.

ఈ చిత్రం ద్వారా గొప్ప పాఠాలే చెప్పాడు రాజ్ కుమార్ హిరాని. ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ చిత్రం ఫ్రెంచ్ భాషలోకి రీమేక్ కూడా కావడం విశేషం. చైనాలో భారతీయ సినిమాలకు మంచి మార్కెట్ రావడానికి పునాది వేసిన చిత్రమిదే కావడం విశేషం. ఈ మైల్ స్టోన్ మూవీకి త్వరలోనే సీక్వెల్ రాబోతుండటం విశేషం.

‘3 ఇడియట్స్’ తర్వాత అమీర్ ఖాన్‌తోనే ‘పీకే’ లాంటి మరో అద్భుత చిత్రాన్ని అందించిన  రాజ్ కుమార్ హిరాని ఇప్పుడు తన మిత్రుడు సంజయ్ జీవిత కథ ఆధారంగా తీసిన ‘సంజు’తో పలకరించబోతున్నాడు. దీని తర్వాత ఆయన చేయబోయే సినిమా ఏదో ఇంకా ఖరారవ్వలేదు. ఈ విషయమై ఇన్నాళ్లూ ఎక్కడా నోరు మెదపని హిరాని.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ‘3 ఇడియట్స్’ సీక్వెల్ కోసం సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పాడు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కూడా మొదలైందన్నాడు. ఐతే అదే తన తర్వాతి సినిమానా.. అందులో ‘3 ఇడియట్స్’ నటీనటులే కనిపిస్తారా అన్నదానిపై ఏమీ మాట్లాడలేదు. ఐతే ఎవరి సంగతెలా ఉన్నా.. అమీర్ ఖాన్ అయితే పక్కాగా ఆ చిత్రంలో నటించే అవకాశముంది.

హిరాని-అమీర్ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. బాక్సాఫీస్ షేకైపోతుంది. పైగా ‘3 ఇడియట్స్’ సీక్వెల్ అంటే ఆసక్తి ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. కాబట్టి భారతీయ ప్రేక్షకులకిది తీపి కబురే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు