మహేష్ సినిమా.. నిజంగా ల్యాండ్‌మార్కే

మహేష్ సినిమా.. నిజంగా ల్యాండ్‌మార్కే

ఒకప్పుడు స్టార్ హీరోలు అలవోకగా వందల సినిమాల్లో నటించేశారు. కానీ తర్వాత కథ మారింది. ఏడాదికి ఒకటి.. మహా అయితే రెండు సినిమాలు చేసే ఈ తరం స్టార్లు కెరీర్ మొత్తంలో కూడా 50 సినిమాలు చేయడం కష్టమయ్యేట్లుంది. అందుకే 25వ సినిమాను కూడా వాళ్లు పెద్ద ల్యాండ్‌ మార్క్‌గా భావించే పరిస్థితి నెలకొంది. మహేష్ బాబు అభిమానులు కూడా అతడి 25వ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు.

ఈ చిత్రంపై మహేష్ ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. దర్శకుడు వంశీ పైడిపల్లికి పూర్తి స్వేచ్ఛ, కావాల్సినంత సమయం ఇచ్చి పక్కాగా స్క్రిప్టు రెడీ చేయించాడు. ఈ చిత్రాన్ని దిల్ రాజు, అశ్వినీదత్ లాంటి ఇద్దరు అగ్ర నిర్మాతల చేతికి అప్పగించాడు. ఐతే ఈ చిత్రానికి ముందు నిర్మాతగా అనుకున్న పొట్లూరి వరప్రసాద్.. కోర్టులో న్యాయపోరాటం చేసి తిరిగి మళ్లీ ఈ సినిమాలో భాగస్వామి అయ్యాడు.

దీంతో ఇప్పుడు ముగ్గురు భారీ నిర్మాతలు మహేష్ సినిమాను నిర్మించబోతున్నట్లయింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. వైజయంతీ మూవీస్.. పీవీపీ సినిమా.. ఈ మూడు వేటికవే బడా బేనర్లు.  వైజయంతీ మూవీస్ ఘన చరిత్ర గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ గత రెండు దశాబ్దాల్లో ఎంత గొప్ప పేరు సంపాదించిందో తెలిసిందే. పీవీపీ సినిమా లేటుగా రంగంలోకి దిగినప్పటికీ భారీ చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించింది.

ఈ మూడు బేనర్లూ ఇంతకుముందు మహేష్‌తో సినిమాలు నిర్మించాయి.ఇప్పుడూ ఈ మూడు కలిసి మహేష్ ల్యాండ్ మార్క్ సినిమా బాధ్యత తీసుకున్నాయి. ఈ మూడు బేనర్ల పేర్లు ఒకే పోస్టర్ మీద పడటం అరుదైన విషయమే. మరి ఈ ముగ్గురు అగ్ర నిర్మాతలు ఎలా కోఆర్డినేట్ చేసుకుంటారో.. ఎంత ఖర్చు పెడతారో.. మహేష్‌తో ఎలాంటి సినిమా తీస్తారో.. అది ఎంత ప్రత్యేకంగా ఉంటుందో.. చూద్దాం మరి.