మణిశర్మ కోసం వర్మ ఆడిన డ్రామా

మణిశర్మ కోసం వర్మ ఆడిన డ్రామా

తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న సంగీత దర్శకుడు మణిశర్మ. తొంభైల చివరి నుంచి ఓ దశాబ్దం పాటు ఆయన హవా సాగింది. తెలుగులో ఉన్న అందరు పెద్ద హీరోలతో వరుసబెట్టి సినిమాలు చేశాడు మణి. ఆయన కమిటైన తొలి సినిమానే మెగాస్టార్ చిరంజీవితో కావడం విశేషం.

మరి చిరు అంతటి వాడు ఒక కొత్త సంగీత దర్శకుడిని ఓకే చేయడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసేదే. ఐతే ఈ విషయంలో క్రెడిట్ అంతా రామ్ గోపాల్ వర్మకే దక్కుతుందని అంటున్నాడు మణిశర్మ. వర్మ ఒక డ్రామా ఆడి.. చిరంజీవి తనకు పచ్చ జెండా ఊపేలా చేశాడని మణి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

‘చూడాలని ఉంది’ కంటే ముందు వర్మ-చిరు కాంబినేషన్లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఆ చిత్రానికి మణిశర్మను సంగీత దర్శకుడిగా పెట్టుకోవాలని వర్మ అనుకున్నాడట. ఐతే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ అంటే చిరు ఒప్పుకోడేమో అనిపించి.. ఒక నాటకం ఆడాడట. ఒక ఆడియో క్యాసెట్ తీసుకెళ్లి చిరుకు ఇచ్చి ఇది రెహమాన్ చేసిన పాటలు వినమని ఇచ్చాడట. చిరు ఆ పాటలు విని భలే ఉన్నాయి.. రెహమాన్ చాలా బాగా చేశాడని కితాబిచ్చాడట. కానీ తర్వాత ఆ పాటు చేసింది రెహమాన్ కాదని.. మణిశర్మ అని వెల్లడించాడట వర్మ.

దీంతో మణి ఆ సినిమాకు ఓకే అయ్యాడట. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఆ తర్వాత అశ్వినీదత్ నిర్మాణంలో గుణశేఖర్ దర్శకుడిగా చిరు చేయాల్సిన ‘చూడాలని ఉంది’కి మణిశర్మే సంగీత దర్శకుడిగా ఫిక్సయ్యాడు. దాంతో పాటుగా ‘బావగారు బాగున్నారా’లోనూ అవకాశం ఇచ్చాడు చిరు. ఈ రెండూ పెద్ద మ్యూజిక్ హిట్లవడంతో మణిశర్మ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు