‘సుల్తాన్’, ‘భజరంగి’ కన్నా.. రేస్-3నే మిన్న

‘సుల్తాన్’, ‘భజరంగి’ కన్నా.. రేస్-3నే మిన్న

రంజాన్ పండక్కి సల్మాన్ ఖాన్ సినిమా రిలీజైందంటే వసూళ్ల మోత మోగాల్సిందే. ఈ సీజన్లో టాక్‌తో సంబంధం లేకుండా అతడి సినిమాలకు వసూళ్లు వస్తుంటాయి. ఐతే గత ఏడాది ‘ట్యూబ్ లైట్’ సినిమా ఈ ఒరవడిని కొనసాగించలేకపోయింది. అందులో మాస్ అంశాలు మిస్సవడం.. సినిమా కూడా పేలవంగా ఉండటంతో ఓపెనింగ్స్ ఆశించిన స్థాయిలో లేవు. కానీ ఈసారి సల్మాన్ బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తున్నాడు. ‘రేస్-3’తో వసూళ్ల మోత మోగిస్తున్నాడు.

ఈ చిత్రానికి నెగెటివ్ టాక్ వచ్చినా సరే.. ఆరంభ వసూళ్లు మాత్రం భారీగా వచ్చాయి. తొలి రోజే రూ.29 కోట్లకు పైగా గ్రాస్ కొల్లగొట్టిన ఈ చిత్రం కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల మార్కును కూడా దాటేసింది. తొలి మూడు రోజు వసూళ్ల విషయంలో సల్మాన్ కెరీర్లోనే నంబర్‌వన్‌గా నిలిచిందీ చిత్రం.

సుల్తాన్.. భజరంగి భాయిజాన్ లాంటి ఆల్ టైం హిట్ల కంటే కూడా ‘రేస్-3’కే తొలి మూడు రోజుల్లో ఎక్కువ వసూళ్లు రావడం విశేషం. 2015లో వచ్చిన సల్మాన్ సినిమా ‘భజరంగి భాయిజాన్’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని శుక్రవారం నుంచి ఆదివారం వరకు రూ.102.6 కోట్లు వసూలు చేసింది. ఆ తర్వాతి ఏడాది రిలీజైన ‘సుల్తాన్’ తొలి మూడు రోజుల్లో రూ.105.53 కోట్లు రాబట్టింది.

ఇప్పుడు ‘రేస్-3’ ఈ రెండు సినిమాల వసూళ్లను దాటేసి ఓపెనింగ్ వీకెండ్లో రూ.106.47 కోట్లతో రికార్డు నెలకొల్పింది. హైయెస్ట్ ఓపెనింగ్ వీకెండ్ రికార్డు సుల్తాన్ పేరిటే ఉంది. ఆ చిత్రం ఐదు రోజుల తొలి వారాంతంలో రూ.180.36 కోట్లు వసూలు చేసింది. ‘రేస్-3’కి నెగెటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో అసలు పరీక్ష సోమవారం మొదలవుతుందని విశ్లేషకులు భావించారు. ఐతే ఈ చిత్రం సోమవారం కూడా రూ.14.5 కోట్లతో ఓకే అనిపించింది. ఈ నెల 29న ‘సంజు’ వచ్చే వరకు ‘రేస్-3’ జోరు కొనసాగేలా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు