ఇళయరాజాను ఎలా ఒప్పించారబ్బా

ఇళయరాజాను ఎలా ఒప్పించారబ్బా

మేస్ట్రో ఇళయరాజా ఒకప్పుడు తెలుగులో వరుసబెట్టి సినిమాలు చేశారు. ఇక్కడి దర్శకులతో ఆయనకు గొప్ప అనుబంధం ఉండేది. వాళ్లతో బాగా సింక్ అయ్యేది. సాధారణమైన సినిమాల్ని కూడా తన సంగీతంతో మరో మెట్టు ఎక్కించిన సందర్భాలు బోలెడు. ఐతే తర్వాత తర్వాత ఇక్కడ సినిమాలు తగ్గించేశారు రాజా. గత కొన్నేళ్లలో అయితే తెలుగులో పూర్తిగా సినిమాలు మానేశారు.
‘గుండెల్లో గోదారి’ లాంటి ఒకటీ అరా సినిమాలకే పని చేశారు. తమిళంలో మాత్రం తరచుగానే సినిమా చేస్తున్నారు. ఈ తరం దర్శకులకు ఇళయరాజాతో పని చేయాలన్న ఆలోచన కూడా రావట్లేదు. ఎవరైనా ఆయనతో సినిమా చేద్దామన్నా కూడా ఆయన్ని ఒప్పించడం చాలా కష్టమవుతోంది. దీంతో ఆయన గురించి ఆలోచించడం మానేస్తున్నారు. ఐతే ఓ లేడీ డైరెక్టర్ ఇళయరాజాను ఒక తెలుగు సినిమాకు ఒప్పించడం విశేషం.

సీనియర్ హీరోయిన్ శ్రియ.. నాగబాబు తనయురాలు కొణిదెల నిహారికల కాంబినేషన్లో ఓ సినిమా మొదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సుజన అనే కొత్త దర్శకురాలు రూపొందించబోతోంది. ఇదొక థ్రిల్లర్ మూవీ అంటున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజాతో సంగీతం చేయించుకోబోతుండటం విశేషం. ‘కంచె’.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ లాంటి చిత్రాలకు ఛాయాగ్రహణం అందించిన జ్ఞానశేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆయనే కోలీవుడ్లో తనకున్న పరచియాల్ని వాడి ఇళయరాజాను ఒప్పించారట.

రాజాకు కూడా స్క్రిప్టు నచ్చి ఓకే చేశారట. ఆయనెప్పుడూ డబ్బుల కోసం సినిమాలు చేయరు. తనను ఎగ్జైట్ చేసే కథ ఉంటేనే సంగీతం చేయడానికి ఒప్పుకుంటారు. ఈ వయసులో కూడా రాజాలో ఉత్సాహం ఏమీ తగ్గలేదు. తమిళంలో గత కొన్నేళ్లలో చక్కటి పాటలు, నేపథ్య సంగీతంతో మెప్పించారాయన. మరి శ్రియ-నిహారిక సినిమాకు ఆయనెలాంటి సంగీతం అందిస్తారో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English