వర్మ.. ఇంకో సినిమా ప్రకటించాడు

వర్మ.. ఇంకో సినిమా ప్రకటించాడు

దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ పతనం ఏ స్థాయికి చేరిందో ‘ఆఫీసర్’తో మరోసారి రుజువైంది. అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరో సినిమాకు ఫుల్ రన్లో కోటి రూపాయల షేర్ రావడాన్ని బట్టి వర్మ దర్శకుడిగా ఏ స్థాయికి పడిపోయాడో అర్థం చేసుకోవచ్చు. గతంలోనూ వర్మ చాలా చెత్త సినిమాలే చేశాడు. కానీ ఏవో పబ్లిసిటీ గిమ్మిక్కులతో ఆయా సినిమాలపై ఆసక్తి పెంచగలిగాడు.


జనాల్ని థియేటర్లకు రప్పించగలిగాడు. కానీ ‘ఆఫీసర్’కు వచ్చేసరికి ఆయన పప్పులు ఏమాత్రం ఉడకలేదు. ఆయనపై ప్రేక్షకులకు నమ్మకం పూర్తిగా పోయిందని ఈ సినిమాతో స్పష్టమైంది. వెంటనే ‘వైరస్’ పేరుతో ఓ హిందీ సినిమా అనౌన్స్ చేశాడు కానీ.. అది నిజంగా పట్టాలెక్కుతుందా లేదా అని కూడా సందేహాలున్నాయి. ఒకవేళ ఆ సినిమా చేసినా.. అది ఏమేరకు జనాల్ని ఆకర్షిస్తుంది అన్నది సందేహమే.

ఇలాంటి సమయంలో వర్మ నిర్మాతగా ఓ సినిమా ప్రకటించడం విశేషం. ఆ చిత్రం పేరు.. భైరవగీత. కొన్ని నెలల కిందట కన్నడలో ‘తగరు’ అనే సినిమా విడుదలైంది. దాని ప్రివ్యూకు వర్మ వెళ్లాడు. ఆ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించిన ‘డాలి’ ధనంజయ పెర్పామెన్స్‌కు ఫిదా అయిపోయాడు వర్మ. అప్పుడే అతడితో తాను ఓ సినిమా తీస్తానని ప్రకటించాడు. ఆ మాట నిలబెట్టుకుంటూ ఇప్పుడు సినిమా అనౌన్స్ చేశాడు వర్మ. సిద్దార్థ అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించనున్నాడు. భాస్కర్ రాశితో కలిసి వర్మ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

ఈ చిత్ర ఫస్ట్ లుక్స్ చూస్తే వర్మ మార్కు కనిపిస్తోంది. ఇదొక ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అంటున్నాడు వర్మ. ఈ చిత్రం కన్నడ-తెలుగు భాషల్లో తెరకెక్కనుంది. ఒకప్పుడు దర్శకుడిగానే కాక నిర్మాతగానూ గొప్ప అభిరుచి చూపించాడు వర్మ. ఇప్పుడు దర్శకుడిగా ఆయన స్థాయేంటో తెలిసిందే. కనీసం నిర్మాతగా అయినా మంచి సినిమాలు తీసి తన ప్రత్యేకతను చాటుకుంటాడేమో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు