అంత పెద్ద మాటలొద్దు తేజూ..

అంత పెద్ద మాటలొద్దు తేజూ..

వరుసగా ఐదు డిజాస్టర్లంటే ఎంత పెద్ద హీరోకైనా కష్టమే. అలాంటిది ఇప్పుడిప్పుడే కెరీర్లో ఎదుగుతున్న సాయిధరమ్ తేజ్ లాంటి వాడి పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పేదేముంది? కాబట్టే అతను తన తర్వాతి సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’పై చాలా ఆశలే పెట్టుకున్నాడు. ఐతే ‘తొలి ప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ రూపొందించిన ఈ చిత్రంపై ఆశించిన స్థాయిలో బజ్ లేదు.

ఇందుకు తేజుతో పాటు కరుణాకరన్ ట్రాక్ రికార్డు కూడా కారణం కావచ్చు. కానీ ఈ చిత్ర బృందం మాత్రం సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తోంది. చిరంజీవి సైతం సినిమా చూసి ఇది కచ్చితంగా హిట్టవుతుందన్న ధీమా వ్యక్తం చేశాడు. ఇక తేజు అయితే తన సినిమా గురించి ఓ రేంజిలో చెప్పేసుకుంటున్నాడు.

కరుణాకరన్ కెరీర్లో మైలురాయిలా నిలిచిపోయిన అతడి తొలి సినిమా ‘తొలి ప్రేమ’ స్టయిల్లోనే ‘తేజ్ ఐ లవ్యూ’ కూడా ఉంటుందని.. ఈ సినిమాలో బలమైన ఎమోషన్లు ఉంటాయని.. రొమాన్స్ కూడా చాలా బాగా పండిందని.. ఈ సినిమా గురించి ఇంకో 20 ఏళ్ల తర్వాత కూడా చెప్పుకుంటారని అన్నాడు తేజు. మిగతా మాటలన్నీ ఓకే కానీ.. మరీ 20 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి చెప్పుకుంటారనడమే విడ్డూరం. విడుదల ముంగిట మరీ ఇంత పెద్ద మాటలు వాడేస్తే కష్టం. ఏమైనా తేడా వస్తే ఇలాంటి మాటలు పట్టుకునే ట్రోలింగ్ మొదలుపెడతారు జనాలు.

తేజు ట్రాక్ రికార్డు ప్రకారం చూస్తే అసలు ఇప్పుడతను తన సినిమా గురించి మాట్లాడకుండా సైలెంటుగా ఉంటే మంచిది. ఇంతకుముందు ఆహా ఓహో అని చెప్పుకున్న సినిమాలన్నీ దారుణ ఫలితాలందుకున్నాయి. ఇలాంటి టైంలో సినిమానే మాట్లాడాలి. హీరో సైలెంటుగా ఉండటం బెటర్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు