ఆ హీరో హనీమూన్‌ ముగిసింది!

ఆ హీరో హనీమూన్‌ ముగిసింది!

టైమ్‌ బాగున్నపుడు చెత్త చిత్రాలు ఎన్ని చేసినా చెల్లిపోతుంది. దాదాపు ఏడేళ్ల పాటు ఎన్ని చెత్త చిత్రాలు చేసినా హిట్‌ అయిపోయిన సల్మాన్‌ ఖాన్‌కి 'ట్యూబ్‌లైట్‌'తో చుక్కెదురైంది. గత ఏడాది రంజాన్‌కి విడుదలైన ట్యూబ్‌లైట్‌ దారుణమైన ఫలితాన్ని చవిచూసింది. రేస్‌ 3తో మళ్లీ రేసుగుర్రంలా దూసుకుపోతాడని ఆశిస్తే ఈ చిత్రానికి అంతటా బ్యాడ్‌ టాక్‌ వినిపిస్తోంది. అయితే సల్మాన్‌ స్టార్‌డమ్‌ కలిసి వచ్చి ఈ యేడాదిలో బాలీవుడ్‌ చిత్రాల్లో అత్యుత్తమ ఓపెనింగ్‌ని ఈ చిత్రం దక్కించుకుంది. కానీ సల్మాన్‌ సుల్తాన్‌తో పోలిస్తే దీనికి వచ్చిన కలక్షన్లు తక్కువే.

రంజాన్‌ పండగ సాయంతో మరో రెండు రోజులు వసూళ్లకి ఢోకా వుండకపోవచ్చు కానీ ఈసారి పరాజయాన్ని తప్పించుకునే అవకాశం కనిపించడం లేదు. కనీసం మాస్‌ కూడా ఎంజాయ్‌ చేయలేని నాసి రకం సినిమా వదలడంతో రేస్‌ 3 ప్రేక్షకులు గగ్గోలు పెడుతున్నారు. బాక్సాఫీస్‌ వద్ద ఏళ్ల తరబడి సాగిన భాయ్‌ హనీమూన్‌ పీరియడ్‌ ఇప్పుడు అఫీషియల్‌గా ముగిసినట్టే. సల్మాన్‌ సినిమా అనగానే ఇక గుడ్డిగా థియేటర్లకి వెళ్లిపోయిన జనం ఇకపై భాయ్‌ చిత్రాల టాక్‌ విని వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. బజరంగి భాయ్‌జాన్‌తో తాను కూడా కంటెంట్‌ బేస్డ్‌ సినిమాలు చేస్తానని అనిపించుకున్న సల్మాన్‌ ఖాన్‌ మళ్లీ మూస సినిమాల బాట పట్టాడు.

అమీర్‌, షారుక్‌ ఇద్దరూ కొత్తరకం చిత్రాలు చేయాలని తపన పడుతోంటే తను మాత్రం లాజిక్‌కి దొరకని సుత్తి సినిమాలతో చావగొడుతున్నాడు. ఎప్పుడో ముగిసిపోయిందని అనుకున్న కెరియర్‌ మళ్లీ ట్రాక్‌ ఎక్కి టాప్‌లోకి తీసుకెళ్లిన తర్వాత మరోసారి సల్మాన్‌ గ్రాఫ్‌ పడిపోవడం మొదలైంది. దీనిని పైకి లేపగలడా లేక ఇలాగే కొద్ది రోజులు కొనసాగిన తర్వాత సైడ్‌ అయిపోతాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు