భాగ్యనగరి సుందరి అదరగొట్టిందిగా..

భాగ్యనగరి సుందరి అదరగొట్టిందిగా..

సమ్మోహనం’ సినిమా చూసిన వాళ్లెవ్వరూ అదితి రావు హైదరిని అంత సులువుగా మరిచిపోలేరు. తెలుగులో ఈ మధ్య కాలంలో వచ్చిన బెస్ట్ హీరోయిన్ క్యారెక్టర్లలో ఇందులో ఆమె చేసిన సమీరా రాథోడ్ పాత్ర ఒకటనడంలో సందేహం లేదు. ఈ పాత్రను ఇంద్రగంటి తీర్చిదిద్దిన తీరు ఒకెత్తయితే.. అందులో అదితి పెర్ఫామెన్స్ మరో ఎత్తు. సినిమా చూశాక ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోలేని స్థాయిలో అద్భుతంగా నటించి మెప్పించింది అదితి. డిఫరెంట్ షేడ్స్.. ఎమోషన్స్ ఉన్న పాత్రను చాలా బాగా అర్థం చేసుకుని సటిల్ పెర్ఫామెన్స్‌తో అదితి ఆద్యంతం ఆకట్టుకుంది. కళ్లతో ఆమె పలికించిన భావాలకు ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. హీరో సుధీర్ బాబు కూడా బాగానే చేసినప్పటికీ.. కొన్ని సార్లు అదితి ముందు అతను నిలవలేకపోయాడు.


అదితి మామూలుగానే చూడ్డానికి చాలా ఎమోషనల్‌గా కనిపిస్తుంది. ఆమె కళ్లు వర్షించడానికి సిద్ధంగా ఉన్నట్లుంటాయి. ఇక సినిమాలో ఆమెది భావోద్వేగాలు నిండిన పాత్ర కావడంతో దానికి పర్ఫెక్ట్‌గా సూటైంది. ఇంద్రగంటి ఏరికోరి అదితినే ఈ పాత్రకు ఎందుకు ఎంచుకున్నాడో.. బాలీవుడ్లో బిజీగా ఉన్నప్పటికీ ఈ సినిమా చేయడానికి అదితి ఎందుకు ఒప్పుకుందో సినిమా చూస్తే అర్థమవుతుంది. అదితి బేసిగ్గా హైదరాబాద్ అమ్మాయే. వాళ్ల స్వస్థలం వనపర్తి. ఆమెది జమీందారీ కుటుంబం. తాతల కాలం నుంచి హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. భాగ్యనగరంలోనే పుట్టి పెరిగిన అదితి.. బాలీవుడ్లో కథానాయికగా అవకాశాలు అందుకుంది. కొన్ని నెలల కిందటే విడుదలై ‘పద్మావతి’ సినిమాలో కీలక పాత్ర పోషించి మెప్పించిన అదితి.. గత ఏడాది ‘చెలియా’ సినిమాతో దక్షిణాదికి పరిచయం అయింది. ఆ సినిమా ఆడకపోయినా అదితి నటనకు ప్రశంసలు దక్కాయి. మణిరత్నం ఆమె పెర్ఫామెన్స్‌కు ఇంప్రెస్ అయ్యి తన తర్వాతి సినిమాలోనూ అవకాశమిచ్చాడు. ఇంతలో ‘సమ్మోహనం’లో ఛాన్సొచ్చింది. ఈ సినిమాతో తెలుగులో ఆమెకు మున్ముందు మంచి అవకాశాలే వస్తాయని భావిస్తున్నారు.