ఇండస్ట్రీపై పంచులే పంచులు

ఇండస్ట్రీపై పంచులే పంచులు

ఇండస్ట్రీలో ఉండి సినిమాలు తీస్తూ ఇండస్ట్రీ మీదే పంచులు వేయాలంటే గట్స్ ఉండాలి. గతంలో కృష్ణవంశీ ‘ఖడ్గం’ సినిమాలో ఇదే చేశాడు. ఆ సినిమాలో పరిశ్రమకు సంబంధించి ఆయన చూపించిన కొన్ని విషయాలు సంచలనం రేపాయి. ఐతే కృష్ణవంశీ అప్పుడున్న రేంజికి అది చెల్లిపోయింది. ఆ తర్వాత ‘సుడిగాడు’ సినిమాలో సినిమాలపై చాలా పంచులు పడ్డాయి. ఐతే అది ఫక్తు పేరడీ సినిమా కాబట్టి నడిచిపోయింది. పూరి జగన్నాథ్ ‘నేనింతే’లో సినిమా సంగతులు చాలానే చూపించాడు కానీ.. అందులో చాలా వరకు సినీ జనాల కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తాయి తప్ప సెటైర్లు ఉండవు. ఐతే ఇప్పుడు ఇంద్రగంటి మోహనకృష్ణ ‘సమ్మోహనం’లో సినీ పరిశ్రమను లక్ష్యంగా చేసుకున్నాడు. అలాగని ఆయనేమీ ఏకపక్షంగా పరిశ్రమపై పడిపోలేదు.

ఇండస్ట్రీలోని ప్రతికూల విషయాల్ని చాలా నేర్పుగా ఎత్తి చూపాడు ఇంద్రగంటి. సోకాల్డ్ కమర్షియల్ సినిమాల మీద ఆయన వేసిన పంచులు భలేగా పేలాయి. స్టార్ హీరోలు చేసే మాస్ మసాలా సినిమాలకు ఎలాంటి టైటిళ్లు పెడతారో.. అందులో పాత్రలు ఎంత విచిత్రంగా ప్రవర్తిస్తాయో.. పంచ్ డైలాగులంటూ ఎలాంటి చెత్తంతా రాస్తారో ఇంద్రగంటి తనదైన స్టయిల్లో సెటైరిగ్గా చూపించాడు ఇంద్రగంటి. ఇక సినిమా షూటింగ్ సందర్భంగా సెట్లో ఎలాంటి వాతావరణం ఉంటుందో.. ప్రొడక్షన్ మేనేజర్ చేసే హడావుడి.. మిగతా వాళ్ల ఓవరాక్షన్ అంతా కూడా భలే ప్రెజెంట్ చేశాడతను. చాలా మంచి డైరెక్టర్ అంటూ తన మిత్రుడు అవసరాల శ్రీనివాస్‌ను, పెద్ద డైరెక్టర్ అంటూ హరీష్ శంకర్‌ను ఒక సందర్భంలో ఫ్రేమ్‌లోకి తీసుకొచ్చాడు. తెర ముందు అందంగా కనిపించే సినీ తారల జీవితాల్లో మనకు తెలియని బాధాకారమైన కోణాలేంటో హీరోయిన్ పాత్ర ద్వారా చక్కగా చూపించాడు ఇంద్రగంటి. మొత్తంగా సినీ పరిశ్రమలోని మంచి చెడులను బ్యాలెన్స్డ్‌గా చూపించడం ద్వారా ప్రశంసలందుకుంటున్నాడు ఇంద్రగంటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు