మహేష్ పొగిడాడు.. ఇంద్రగంటి పరవశించాడు

మహేష్ పొగిడాడు..  ఇంద్రగంటి పరవశించాడు

శుక్రవారం రిలీజైన ‘సమ్మోహనం’ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇది తన బావ సుధీర్ బాబు సినిమా కావడంతో సూపర్ స్టార్ మహేష్ బాబు దీనిపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాడు. ఈ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్‌కు కూడా హాజరై చాలా పాజిటివ్‌గా మాట్లాడాడు. రిలీజ్ ముంగిట కూడా ట్వీట్ చేశాడు. విడుదల తర్వాత కూడా మహేష్ ఈ సినిమాకు ట్విట్టర్లో ప్రచారం చేస్తుండటం విశేషం. తొలి రోజే మహేష్ ‘సమ్మోహనం’ చూసి దాని గురించి చాలా పాజిటివ్‌గా ట్వీట్ చేశాడు. ప్రి రిలీజ్ ఈవెంట్లో మాదిరే దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంద్రగంటి రచన, దర్శకత్వం రెండూ చాలా అందంగా సాగాయని.. మన ఇండస్ట్రీలోని గొప్ప ప్రతిభావంతుల్లో ఇంద్రగంటి ఒకడని మహేష్ అన్నాడు.

సుధీర్ బాబు, అదితిరావు అత్యున్నత స్థాయి నటన కనబరిచారని.. వీళ్లిద్దరికీ ఇది కెరీర్ బెస్ట్ పెర్ఫామెన్స్ అని అన్నాడు మహేష్. నరేష్ నటన గురించి కూడా మహేష్ ప్రత్యేకంగా ప్రస్తావించాడు. మహేష్ తనకు.. తన సినిమాకు ఇచ్చిన కాంప్లిమెంట్స్‌తో ఇంద్రగంటి ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఇప్పటిదాకా తాను అందుకున్న బెస్ట్ కాంప్లిమెంట్ ఇదే అని ఇంద్రగంటి అన్నాడు. ఈ ప్రశంసలు తనకెంత ఆనందాన్నిచ్చాయో మాటల్లో చెప్పలేనని ఇంద్రగంటి అన్నాడు. మరోవైపు మహేష్ ట్వీట్‌పై సుధీర్ బాబు స్పందిస్తూ.. ఇంద్రగంటి సినిమా సెట్ కంటే ప్రశాంతమైన చోటు ఈ ప్రపంచంలో మరొకటి ఉండదని.. ఆయన్ని తానెంతో ఆరాధిస్తానని అన్నాడు. ఇండస్ట్రీ ప్రముఖులు మరెందరో ‘సమ్మోహనం’ గురించి చాలా పాజిటివ్‌గా మాట్లాడారు. ఇంద్రగంటి అండ్ కోపై ప్రశంసల జల్లు కురిపించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు