వినాయక్ ఏం మారతాడు పాపం

వినాయక్ ఏం మారతాడు పాపం

కొన్నేళ్ల కిందటి వరకు టాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకడిగా ఉండేవాడు వి.వి.వినాయక్. ‘ఆది’.. ‘దిల్’.. ‘ఠాగూర్’?. ‘బన్నీ’.. ‘కృష్ణ’.. ‘అదుర్స్’.. ‘ఖైదీ నంబర్ 150’ లాంటి భారీ విజయాలున్నాయి అతడి ఖాతాలో. కానీ మాస్ మసాలా సినిమాలకు పెట్టింది పేరైన వినాయక్.. ట్రెండు మారి ప్రేక్షకులు కొత్త తరహా సినిమాలు కోరుకోవడం మొదలుపెట్టాక ఇబ్బంది పడ్డాడు. అతడి సినిమాలు ఈతరం ప్రేక్షకులకు ఏమాత్రం రుచించడం లేదు. ‘అఖిల్’.. ‘ఇంటిలిజెంట్’ లాంటి సినిమాలు చూస్తే వినాయక్ ఎంత ఔట్ డేట్ అయిపోయాడో అర్థమవుతుంది. ముఖ్యంగా ‘ఇంటిలిజెంట్’ చూశాక వినాయక్ పనైపోయిందన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. వినాయక్ ఇక మారడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఈ స్థితిలో వినాయక్ తనేంటో రుజువు చేసుకోవాల్సిన స్థితిలో నిలిచాడు. తనకు కూడా కొత్త తరహా కథలు ట్రై చేయాలని ఉందని.. కానీ ఎప్పటికప్పుడు కమిట్మెంట్లు ఇచ్చేయడం.. కాంబినేషన్లు సెట్ అయిపోతుంటంతో రాజీ పడాల్సి వస్తోందని అన్నాడు వినాయక్.

ఐతే ‘ఇంటిలిజెంట్’ అతడికి చాలా చెడ్డ పేరు తెచ్చిపెట్టిన నేపథ్యంలో ఈసారి మార్పు చూపించడానికి గట్టి ప్రయత్నమే చేస్తాడని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే అలాంటి ఆశలేమీ కలగట్లేదు. మళ్లీ ‘ఇంటిలిజెంట్’ ప్రొడ్యూసర్ సి.కళ్యాణ్ నిర్మాణంలోనే బాలయ్య హీరోగా ఓ సినిమాకు సన్నాహాలు చేస్తున్నాడు వినాయక్. ఈ సినిమాను సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టేయాలని బాలయ్య తొందరపెడుతుండటంతో ఆల్రెడీ తనకు అలవాటైన రచయితలతోనే ఒక మాస్ కథ వండే ప్రయత్నంలో పడ్డాడు వినాయక్. పాత కాలం ఆలోచనలతో సినిమాలు తీస్తున్నాడని ప్రేక్షకులు తిట్టి పోస్తున్న నేపథ్యంలో వినాయక్.. కొంచెం టైం తీసుకుని ఏదైనా కొత్తగా ట్రై చేయాల్సిన అవసరం ఉందిప్పుడు. కానీ అలాంటి అవకాశమే లేకుండా అతడిని ఫిక్స్ చేసేశారు. దీంతో వినాయక్ మళ్లీ పాత స్టయిల్లోనే ఒక మసాలా కథ కోసం ట్రై చేస్తున్నాడట. నిర్మాత.. హీరో నుంచి ఈ విషయంలో అభ్యంతరాలేమీ లేకపోవడంతో వినాయక్ కొత్తగా ఏమీ ట్రై చేయాల్సిన అవసరం లేకపోయింది. ఈ సినిమా ఎలా ఆడుతుందో ఏమో కానీ.. వినాయక్ నుంచి మరోసారి కొత్తగా ఏమీ ఆశించొద్దన్న సంకేతాలైతే చిత్ర యూనిట్ నుంచి వస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English