రాజ్-రాజు.. ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు

రాజ్-రాజు.. ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు

ఒక సినిమాకు పాటలు ఒకరితో చేయించుకోవడం.. బ్యాగ్రౌండ్ స్కోర్ కోసం ఇంకొకరు పని చేయడం.. ఇద్దరు ముగ్గురు కలిసి పాటలు కంపోజ్ చేయడం బాలీవుడ్లో కామన్. మన దగ్గర అరుదుగా మాత్రమే అలా జరుగుతుంటుంది. ఎక్కువగా ఒకే సంగీత దర్శకుడితో వెళ్లిపోతుంటారు మన దర్శక నిర్మాతలు. ఐతే దిల్ రాజు ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న ఓ కొత్త సినిమాకు మాత్రం ఏకంగా ఐదుగురు సంగీత దర్శకులు పని చేస్తుండటం విశేషం. అదేమీ పెద్ద ప్రాజెక్టు కూడా కాదు. ఓ చిన్న సినిమా. రాజ్ తరుణ్ హీరోగా ‘అలా ఎలా’ ఫేమ్ అనీష్ కృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు ‘లవర్’ అనే సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ఐదుగురు మ్యూజిక్ డైరెక్టర్లు పని చేస్తున్నారు. ఈ సంగతి తాజాగా లాంచ్ చేసిన ఈ చిత్ర టైటిల్ లోగోలో వెల్లడైంది.


‘లవర్’కు సంగీత దర్శకులుగా అంకిత్ తివారి.. తనిష్క్ బగ్చి.. ఆర్కో.. రిషి రిచ్.. సాయి కార్తీక్‌ల పేర్లు వేశారు. వీరిలో సాయికార్తీక్ మాత్రమే పరిచయం ఉన్నవాడు. అంకిత్ తివారి బాలీవుడ్లో ‘ఆషిఖి-2’తో సూపర్ ఫేమస్ అయ్యాడు. మిగతా వాళ్లు కొత్తగానే అనిపిస్తున్నారు. వీళ్లు ఒక్కొక్కరితో ఒక్కొక్క పాట చేయించుకున్నారమో. సాయికార్తీక్ నేపథ్య సంగీతం అందిస్తూ ఉండొచ్చు. దిల్ రాజు మామూలుగా ఇలా వేర్వేరు సంగీత దర్శకులతో పని చేయడం అరుదు. ఇది దర్శకుడు అనీష్ ఐడియానే అయ్యుండొచ్చు. ‘అలా ఎలా’ వచ్చి దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. మధ్యలో అల్లరి నరేష్‌తో ఓ సినిమా మొదలుపెట్టి ఆపేసిన అనీష్.. చాలా గ్యాప్ తర్వాత రాజు నిర్మాణంలో సినిమా మొదలుపెట్టాడు. వరుస ఫ్లాపుల్లో ఉన్న రాజ్ తరుణ్‌కు ఈ చిత్రం హిట్టవడం చాలా అవసరం. జులైలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు