రెహమాన్ అభిమానులూ.. గెట్ రెడీ

రెహమాన్ అభిమానులూ.. గెట్ రెడీ

దేశం గర్వించదగ్గ సంగీత దర్శకుల్లో ఎ.ఆర్.రెహమాన్ ఒకరు. జింగిల్స్‌ కంపోజర్‌గా ప్రస్థానం మొదలుపెట్టి.. హాలీవుడ్ స్థాయికి ఎదిగాడు. బారతీయ సినీ సంగీత దర్శకుల్లో ఎవరికీ సాధ్యం కాని ఘనతలు అందుకున్నాడు. ఏకంగా రెండు ఆస్కార్ అవార్డులూ అందుకున్నాడు. చాలా సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రెహమాన్ ఈ స్థాయికి చేరడం అసాధారణ విషయమే. రెండున్నర దశాబ్దాలుగా తన మెస్మరైజింగ్ మ్యూజిక్‌తో సంగీత ప్రియుల్ని మైమరిపిస్తున్న రెహమాన్.. ఇప్పటికీ కొత్తదనం కోసం తపించే తీరు అబ్బురపరుస్తుంది.

ఎంత ఎదిగినా ఒదిగి ఉండే రెహమాన్ వ్యక్తిత్వం కూడా ఆయనకు ఎంతోమంది అభిమానుల్ని తెచ్చిపెట్టింది. ఎంతో స్ఫూర్తినిచ్చే రెహమాన్ ప్రయాణం ఇప్పుడు పుస్తక రూపంలోకి రాబోతోంది. ‘నోట్స్ ఆఫ్ ఎ డ్రీమ్: ది ఆథరైజ్డ్ బయోగ్రఫీ ఆఫ్ ఎ.ఆర్.రెహమాన్’ పేరుతో ఆయన జీవిత కథ తయారైంది.

చెన్నైకి చెందిన కృష్ణ త్రిలోక్ అనే రచయిత రెహమాన్ జీవిత కథను గ్రంథస్తం చేశాడు. చిన్నతనం నుంచి ఇప్పటిదాకా రెహమాన్ ప్రయాణాన్ని స్ఫూర్తిదాయకంగా ఈ పుస్తకంలో పొందుపరిచారట. పెంగ్విన్ రాండమ్ హౌజ్ ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేస్తోంది. రెహమాన్‌కు అంతర్జాతీయ స్తాయిలో గొప్ప గుర్తింపు తెచ్చిపెట్టడమే కాక రెండు ఆస్కార్ అవార్డులు కూడా అందించిన ‘స్లమ్ డాగ్ మిలియనీర్’చిత్రానికి దర్శకత్వం వహించిన హాలీవుడ్ దర్వకుడు డానీ బోయెల్ ఈ పుస్తకానికి ముందు మాట రాయడం విశేషం.

త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న ఈ పుస్తకానికి భారీ ఎత్తున ప్రి సేల్ ఆర్డర్స్ వచ్చినట్లు సమాచారం. మరి ఈ పుస్తకం రెహమాన్ జీవితాన్ని ఏ రకంగా ఆవిష్కరిస్తుందో చూడాలి. రెహమాన్ అభిమానులకు ఇదో గొప్ప కానుక అనడంలో సందేహం లేదు.


 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు