రజనీని ఇలానా వాడుకునేది?

రజనీని ఇలానా వాడుకునేది?

సూపర్ స్టార్ రజనీకాంత్‌ ఫాలోయింగ్, ఇమేజ్ ఎలాంటిదో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చరిష్మాను సరిగ్గా వాడుకుంటే తెరమీద అద్భుతాలు చేయొచ్చు. ఆ విషయాన్ని శంకర్ ఇప్పటికే ఒకటికి రెండుసార్లు రుజువు చేశాడు. అంతకుముందు కూడా కొందరు దర్శకులు రజనీ చరిష్మాను అద్భుతంగా వాడుకుని బాక్సాఫీస్‌ను షేక్ చేసే సినిమాలు అందించారు. కానీ గత పుష్కర కాలంలో మాత్రం ఒక్క శంకర్ మినహా ఏ దర్శకుడూ రజనీని సరిగ్గా ఉపయోగించుకోలేకపోయాడు.

ఐతే ‘కబాలి’ సినిమా ప్రోమోలు చూస్తే పా.రంజిత్ సైతం రజనీని బాగానే చూపిస్తాడని.. ఆయన అభిమానులు ఆశించారు. కానీ రజనీ అభిమానుల్నే కాక సామాన్య ప్రేక్షకులనూ తీవ్ర నిరాశకు గురి చేశాడు రంజిత్. ‘కాలా’తో అయినా అతను మార్పు చూపిస్తాడేమో అనుకుంటే.. అది కొంత వరకే పరిమితం అయింది. ఒకట్రెండు ఎలివేషన్ సీన్లతో రజనీ అభిమానుల్ని మురిపించినా.. తర్వాత సినిమా అంతటా రంజిత్ ముద్రే కనిపించింది.

ద్రవిడ రాజకీయాల గురించి.. దళిత్ ఐడియాలజీ గురించి ఏదో చెప్పాలన్న తపన అతడిలో కనిపిస్తుంది. ‘కబాలి’తో పాటు ‘కాలా’లోనూ ఆ సంకేతాలు బాగా కనిపిస్తాయి. రజనీ లాంటి సూపర్ స్టార్ సినిమా అయితే తాను చెప్పాలనుకున్న విషయం చాలామందికి చేరుతుందనే ఉద్దేశంతో అతను ‘కబాలి’.. ‘కాలా’ తరహా సినిమాలు చేసినట్లుగా కనిపిస్తుంది. కానీ రజనీ సినిమాల నుంచి జనాలు ఆశించేది వేరు. ఏదైనా సందేశాలు ఇవ్వదలుచుకుంటే.. తన అభిప్రాయాలు చెప్పాలనుకుంటే.. అవి అంతర్లీనంగా ఉండేలా.. సుగర్ కోటింగ్ వేసి చెప్పినట్లుగా ఉండాలి. అంతే తప్పే రజనీ ఇమేజ్‌ను కప్పేసేలా.. ప్రేక్షకులకు అసహనం తెప్పించేలా ఆ అంశాలే ప్రధానంగా కనిపించకూడదు.

అప్పుడు అసలు ఉద్దేశమే చెడిపోతుంది. ప్రేక్షకులు సినిమాను తిప్పి కొట్టాక ఇక రంజిత్ చెప్పాలనుకున్నది ఎలా అందరికీ చేరుతుంది. ‘కబాలి’ ఫలితం చూసైనా.. ‘కాలా’ విషయంలో అతను జాగ్రత్త పడాల్సింది. కానీ అతనేమీ పెద్దగా మారలేదు. మళ్లీ తన స్టయిల్లోనే రజనీని ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా దారుణ ఫలితాన్నందుకుంది. తమిళనాట పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. మిగతా చోట్ల తుస్సుమనిపించింది. ఈ నేపథ్యంలో రంజిత్ తర్వాత ఎలాంటి సినిమా తీస్తాడు.. తన ఐడియాలజీని అందులో ఎలా చూపిస్తాడు అన్నది ఆసక్తికరం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English