శేఖర్ కమ్ములతో చేయాలనుందట

శేఖర్ కమ్ములతో చేయాలనుందట

‘సమ్మోహనం’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అవుతున్న బాలీవుడ్ హీరోయిన్ అదితి రావు హైదరి పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే అన్న సంగతి చాలామందికి తెలియదు. జమీందారు కటుంబానికి చెందిన అదితి వాళ్ల స్వస్థలం వనపర్తి. వాళ్ల కుటుంబం హైదరాబాద్‌లో సెటిలైంది. యుక్త వయసు వరకు అదితి ఇక్కడే ఉంది. తర్వాత ముంబయి వెళ్లి అక్కడే సినిమాల్లో అవకాశాలు అందుకుంది.

చాలా ఏళ్ల తర్వాత ఆమె ‘చెలియా’ సినిమా ద్వారా దక్షిణాదికి పరిచయం అయింది. ఇప్పుడు ఎట్టకేలకు తన సొంత గడ్డ హైరదాబాద్ వచ్చి తెలుగు సినిమాలో నటించింది. అదే.. సమ్మోహనం. ఇలాంటి సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ఆమె చెప్పింది.

దర్శకుడు ఇంద్రగంటి ముందు తనకు ఫోన్ చేసి ‘సమ్మోహనం’ గురించి ప్రస్తావించినపుడు.. నాలుగైదు లైన్లలో కథ విందామనుకున్నానని.. కానీ ఐదు నిమిషాల పాటు ఆయన లైన్ చెప్పాక చాలా ఆసక్తికరంగా అనిపించి ఫుల్ నరేషన్ ఇవ్వమన్నానని అదితి తెలిపింది. ఒక చిన్నపిల్ల లాగా పూర్తి కథ విన్నానని.. చాలా నచ్చేసి తన దగ్గర డేట్లు లేకపోయినా ఈ సినిమా చేసి తీరాల్సిందే అని ఫిక్సయ్యానని అదితి తెలిపింది. తన డేట్లు ఖాళీ అయ్యేవరకు వెయిట్ చేయమని కండిషన్ పెట్టి మరీ.. తర్వాత వీలు చేసుకుని ఈ సినిమా చేసినట్లు అదితి వెల్లడించింది.

ఇక దక్షిణాదిన వరుసగా సినిమాలు చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పింది. తెలుగులో తాను సినిమా చేయాలనుకునే దర్శకుడు శేఖర్  కమ్ముల అని అదితి వెల్లడించడం విశేషం. తమిళంలో మిస్కిన్(పిశాచి, డిటెక్టివ్ ఫేమ్) .. కార్తీక్ సుబ్బరాజ్ (పిజ్జా దర్శకుడు) లాంటి దర్శకులతో పని చేయాలనుకుంటున్నానని ఆమె చెప్పింది.