అవసరాల కథ.. ఇంద్రగంటి దర్శకత్వం.. కానీ

అవసరాల కథ.. ఇంద్రగంటి దర్శకత్వం.. కానీ

మహేష్ బావ సుధీర్ బాబు కెరీర్లో చాలా వరకు కొత్త.. చిన్న స్థాయి దర్శకులతోనే పని చేశాడు. ఇప్పుడతను తొలిసారిగా ఇంద్రగంటి మోహనకృష్ణ లాంటి అనుభవజ్ఞుడైన.. మంచి అభిరుచి ఉన్న దర్శకుడితో సినిమా చేశాడు. అదే.. సమ్మోహనం. తాను ‘సమ్మోహనం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో చాలా ఎమోషనల్ అయిపోవడానికి కూడా ఇదే కారణమని.. ఇంద్రగంటి లాంటి దర్శకుడు తనతో సినిమా చేయడానికి సిద్ధం కావడం తనకు దక్కిన గొప్ప గౌరవమని అంటున్నాడు సుధీర్.

నిజానికి ఇంద్రగంటి సుధీర్ బాబుతో ఎప్పుడో సినిమా చేయడానికి ముందుకొచ్చాడట. తన తొలి సినిమా ‘ఎస్ఎంఎస్’ టైంలోనే ఇంద్రగంటి తనకు ఒక కథ చెప్పినట్లు సుధీర్ బాబు వెల్లడించాడు. ఆ కథ రాసింది అవసరాల శ్రీనివాస్ అట. కథ నచ్చి ఆ సినిమా చేయడానికి తాను రెడీ అయ్యానని.. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదని చెప్పాడు సుధీర్. తర్వాత ఇన్నేళ్లకు ఇంద్రగంటితో సినిమా చేసే అవకాశం వచ్చిందని అన్నాడు.

‘సమ్మోహనం’లో తాను చిన్న పిల్లల పుస్తకాలకు బొమ్మలేసే కుర్రాడిగా నటించానని.. ఈ పాత్ర చేయడానికి ఇంద్రగంటి నుంచే స్ఫూర్తి పొందానని.. ఆయన ఆలోచనల్నే తన పాత్ర ద్వారా చూపించే ప్రయత్నం చేశానని సుధీర్ తెలిపాడు. ఇంద్రగంటి లాంటి దర్శకుడు.. తాను పని చేసిన హీరోల్లో ది బెస్ట్ అనడం గర్వంగా ఉందని సుధీర్ చెప్పాడు. ప్రస్తుతం తాను సొంత బేనర్లో ఆర్.ఎస్.నాయుడు అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నానని.. అది కాక ‘వీర భోగ వసంత రాయలు’ సినిమాలో నటిస్తున్నానని.. అందులో తన పాత్ర చాలా భిన్నంగా ఉంటుందని సుధీర్ చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు