శ్రీలత లేదు.. ఉంది రోజానే

శ్రీలత లేదు.. ఉంది రోజానే

సినిమా నటిగా.. టీవీ షో జడ్జిగా.. ఎమ్మెల్యేగా.. గృహిణిగా నాలుగు పాత్రలను సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్న మహిళామణి రోజా. అప్పట్లో టాలీవుడ్.. కోలీవుడ్ లలో టాప్ హీరోయిన్ గా ఆమెకు పేరుంది. ఈ రెండు భాషల్లో టాప్ స్టార్లందరి పక్కన ఆమె నటించింది. ప్రస్తుత తరంలో ఈటీవీలో జబర్దస్ట్ షో జడ్జిగా బాగా పేరు తెచ్చుకుంది. హీరోయిన్ అవ్వాలన్న విషయంలో రోజాది ఎంత మొండి పట్టుదలో రైటర్ పరుచూరి గోపాలకృష్ణ తాజాగా బయటపెట్టారు.

రోజా కు గుర్తింపు వచ్చింది సర్పయాగం సినిమాతో. అందులో ఆమె శోభన్ బాబు కుమార్తెగా నటించింది. ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసింది పరుచూరి గోపాలకృష్ణే. ఈ సినిమాలో శోభన్ బాబు కుమార్తె పాత్రే కీలకం. ‘‘ఈ పాత్రకు ముందు మీనాను తీసుకుందామని సినిమా నిర్మాత రామానాయుడు అనుకున్నారట. కానీ సర్పయాగం సినిమాలో శోభన్ బాబు కుమార్తె పాత్ర చనిపోతుంది. అప్పటికి సీతారామయ్య గారి మనవరాలు విడుదలై బ్లాక్ బస్టర్ అయంది. అలాంటప్పుడు ఆమె పాత్ర చనిపోతుందంటే ప్రేక్షకులు చూడలేరని వేరే హీరోయిన్ ను తీసుకోవాలి అనుకున్నాం. ఆ టైంలో ప్రస్తుత చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తీసిన తపస్సు సినిమాలో రోజాను ఫస్ట్ టైం చూశాను. అందులో రోజా ముఖంలో ఓ మెరుపు కనిపించింది. దాంతో ఆమెను హీరోయిన్ గా తీసుకున్నామంటూ’’ పరుచూరి గోపాలకృష్ణ ఆనాటి సంగతులు వివరించారు.

‘‘సర్పయాగం షూటింగ్ లో భాగంగా రిహార్సల్ టైంలో రోజా స్విమ్ సూట్ తో కనిపించింది. తనకి శ్రీదేవిలాగా గ్లామరస్‌ హీరోయిన్‌ అవ్వాలన్న కోరిక ఉండేది. తపస్సు సినిమా ఆడలేదు. ఈ సర్పయాగం ఆడుతుందో లేదో తెలీదు. ఇలా స్విమ్ సూట్ లో సినిమాలో కనిపించి మళ్లీ నువ్వు బయటకు వెళ్లి చదువుకోవడానికి వెళ్లాల్సి వస్తే పరిస్థితేంటి?’ అని అడిగాను.  అప్పుడామె ‘‘శ్రీలత లేదు. ఇది రోజా అంటూ బదులిచ్చిందని’’ రోజా పట్టుదల గురించి గోపాలకృష్ణ చెప్పుకొచ్చారు. రోజా అసలు పేరు శ్రీలత. అదీ సంగతి

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు