ప్రేమయుద్ధంలో గెలిచేదెవరు?

ప్రేమయుద్ధంలో గెలిచేదెవరు?

ఒకప్పటితో పోలిస్తే టాలీవుడ్లో ప్రేమకథలు బాగా తగ్గిపోయాయి. అలాగని ప్రేమకథల్ని ఇప్పటి జనాలు ఆదరించరనేమీ లేదు. లవ్ స్టోరీలు ఎవర్ గ్రీన్.. వాటికి ట్రెండుతో సంబంధం ఉండదు. మంచి ఫీల్ తో ప్రేమకథలు రూపొందిస్తే ప్రేక్షకులు వాటికి గొప్ప విజయాలే అందిస్తారు. పోయినేడాది ‘నిన్ను కోరి’.. ఈ ఏడాది ఆరంభంలో ‘తొలి ప్రేమ’ ఎంత మంచి విజయాలందుకున్నాయో తెలిసిందే. యువతకు కనెక్టయ్యే ప్రేమకథలు తీస్తే వాటికి చాలా మంచి ఫలితం ఉంటుంది. కొంచెం గ్యాప్ తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలోకి రెండు ప్రేమకథలు దిగుతున్నాయి. ఒక్క రోజు వ్యవధిలో రెండు ప్రేమకథలు పోటీ పడుతుండటం విశేషం. ఆవే.. నా నువ్వే.. సమ్మోహనం. ‘నా నువ్వే’ గురువారం ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా.. మరుసటి రోజు ‘సమ్మోహనం’ విడుదలవుతున్నాయి.

ఈ రెండు సినిమాల కాంబినేషన్లు ఆసక్తి రేకెత్తించేవే. కెరీర్ ఆరంభం నుంచి మాస్ కథల్లోనే నటిస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్ తొలిసారిగా పూర్తి స్థాయి లవర్ బాయ్ అవతారం ఎత్తి.. ‘180’ దర్శకుడు జయేంద్ర దర్శకత్వంలో నటించిన సినిమా ‘నా నువ్వే’. ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ లుక్ పూర్తిగా మారిపోయింది. ఈ చిత్ర టీజర్.. ట్రైలర్ చూసినా.. ఇది కళ్యాణ్ రామ్ సినిమానేనా అని సందేహాలు కలుగుతాయి. తమన్నా లాంటి స్టార్ హీరోయిన్ తో కళ్యాణ్ రామ్ రొమాన్స్ పండించడానికి బాగానే ప్రయత్నించినట్లున్నాడు. మంచి ఫీల్.. ఎమోషన్ ఉన్న సినిమాలాగే కనిపించింది ‘నా నువ్వే’. ఇక ‘సమ్మోహనం’ విషయంలో అందరి దృష్టీ ఇంద్రగంటి మీదే ఉంది. మెచ్యూర్డ్ లవ్ స్టోరీలు తీస్తాడని పేరున్న ఇంద్రగంటి.. మధ్యలో వేర్వేరు జానర్లు ట్రై చేశాడు. ఇప్పుడు మళ్లీ ప్రేమకథ తీశాడు. సుధీర్ బాబు సరసన అదితి రావు హైదరి లాంటి బాలీవుడ్ హీరోయిన్ నటిస్తుండటం ఆసక్తి రేకెత్తించే విషయం. ఈ చిత్ర ప్రోమోలు సినిమాపై ఆసక్తి రేకెత్తించాయి. కాకపోతే ఈ రెండు సినిమాలకూ ప్రి రిలీజ్ బజ్ అంతంతమాత్రంగానే ఉంది. ఇవి జనాల్ని థియేటర్లకు ఏమాత్రం ఆకర్షిస్తాయో అన్న సందేహాలు లేకపోలేదు. మరి ఈ వారం బాక్సాఫీస్ ప్రేమ యుద్ధంలో గెలిచేదెవరో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English