ఎన్టీఆర్‌తో మళ్లీ కళ్యాణ్ రామ్ సినిమా

ఎన్టీఆర్‌తో మళ్లీ కళ్యాణ్ రామ్ సినిమా

నందమూరి కళ్యాణ్ రామ్ హీరో మాత్రమే కాదు. నిర్మాత కూడా. అతను హీరోగా చేసిన మెజారిటీ సినిమాలకు అతనే నిర్మాత. ఐతే ‘అతనొక్కడే’.. ‘పటాస్’ మినహాయిస్తే కళ్యాణ్ రామ్ ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ అతడికి నష్టాలే మిగిల్చాయి. మొత్తంగా చూస్తే నిర్మాతగా లాభాలతో పోలిస్తే నష్టాలు కొన్ని రెట్లు ఉంటాయి. అలాంటి వాడు గత ఏడాది నిర్మాతగా భారీ లాభాలందుకున్నాడు. తన నష్టాలన్నీ కవర్ చేసే స్థాయిలో ఆదాయం సంపాదించాడు కళ్యాణ్ రామ్. ఆ చిత్రమే.. ‘జై లవకుశ’. తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా బాబీ దర్శకత్వంలో మీడియం బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించాడు కళ్యాణ్ రామ్. హ్యాట్రిక్ విజయాలతో ఎన్టీఆర్ మాంచి ఊపుమీదుండగా చేసిన సినిమా కావడంతో దీనికి భారీగా బిజినెస్ జరిగింది. పెట్టుబడి మీద భారీగానే లాభాలు ఆర్జించాడు కళ్యాణ్ రామ్.

తన అన్నయ్యకు ఆర్థిక తోడ్పాటు అందించడానికే ఎన్టీఆర్ ఈ సినిమా చేసి పెట్టాడన్న ప్రచారం జరిగింది ఆ టైంలో. మొత్తానికి అతను ఆశించిందే జరిగింది. ఐతే ఎన్టీఆర్-కళ్యాణ్ రామ్ సినిమా బంధం అంతటితో ఆగబోవట్లేదు. అన్నయ్య కోసం తారక్ ఇంకో సినిమా కూడా చేయబోతున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా కళ్యాణ్ రామే చెప్పాడు. తన కొత్త సినిమా ‘నా నువ్వే’ ప్రమోషన్లలో భాగంగా అతను ఈ సంగతి వెల్లడించాడు. తమ్ముడితో ఇంకో సినిమా ప్రొడ్యూస్ చేయొచ్చని.. అది వచ్చే ఏడాది ఉంటుందని.. ఇప్పటికే ఈ విషయమై తమ మధ్య చర్చలు నడుస్తున్నాయని చెప్పాడు కళ్యాణ్ రామ్. మరి ఈసారి వీళ్లిద్దరూ ఏ దర్శకుడిని ఎంచుకుంటారో.. ఎలాంటి కథతో సినిమా చేస్తారో.. అది ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన ‘ఎన్టీఆర్ ఆర్ట్స్’ బేనర్లో తనే హీరోగా సినిమాటోగ్రాఫర్ గుహన్ దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English