కామెంట్లకు... కలెక్షన్లకు లింకుందా?

కామెంట్లకు... కలెక్షన్లకు లింకుందా?

సెలబ్రిటీ ప్రతి మాట ఆచితూచి మాట్లడాల్సిందే. ఎందుకంటే వారి నోటి నుంచి వచ్చే ప్రతిమాట వేలాది మంది దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రేక్షకులు అమితంగా అభిమానించి వీలైనంత వరకు అనుకరించే స్టార్ హీరోలు ఈ విషయంలో ఇంకా జాగ్రత్తగానే ఉండాలి. ఆ స్థాయి వ్యక్తులు మాట్లాడే మాటలో చిన్న తేడా వచ్చినా దానికి ఒకోసారి భారీమూల్యం చెల్లించాల్సి రావచ్చు. ప్రస్తుతం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పరిస్థితి ఇలాగే ఉంది.

రజనీ లేటెస్ట్ మూవీ కాలా రీసెంట్ గా థియేటర్లకొచ్చింది. రజనీ ఇతర సినిమాలతో ఈ సినిమాకు ఓపెనింగ్స్ - కలెక్షన్స్ రెండూ డల్లుగానే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందు కావేరీ నది జలాల వివాదానికి సంబంధించి కర్ణాటక ప్రయోజనాలకు వ్యతిరేకంగా రజనీ మాట్లాడారంటూ అక్కడి ఫిలిం ఇండస్ట్రీ ఈ సినిమాను ఆ రాష్ట్రంలో విడుదల చేయనీయలేదు. ఈ ఇష్యూలో స్వయంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామే తాను చేసేదేం లేదని చేతులెత్తేశాడు. తాజాగా తమిళనాడులోని తూత్తుకుడిలో స్టెరిలైట్ కర్మాగార వివాదం విషయంలోనూ రజనీ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడాడు. అసలే ప్రభుత్వంపై మండిపడుతున్న అక్కడి ప్రజలు దీంతో తీవ్రంగా హర్టయి అసలు కాలా సినిమాను పట్టించుకోవడమే మానేశారు. పవన్ తో వివాదానికి తెరలేపిన ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఆఫీసర్ అట్టర్ ఫ్లాపవడమూ మరో ఉదాహరణ అని సినీ జనాలు గుర్తు చేస్తున్నారు.

రజనీ చేసిన ఈ రెండు కామెంట్లు సినిమాకు తీవ్ర నష్టం కలిగించాయని కొందరు అంటున్నారు. ఇదే టైంలో ఇలాంటి వ్యాఖ్యల ప్రభావం అంతంతేనని.. వాటి గురించి సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదనేది కొందరి మాట. ఆమధ్య అమీర్ ఖాన్ అసహనం గురించి తప్పుగా మాట్లాడి తీవ్ర విమర్శల పాలయ్యాడు. ఆయన తీరును చాలామంది తప్పు పట్టారు కూడా. అయినా అమీర్ నటించిన దంగల్ దేశంలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాల్లో రెండోస్థానంలో ఉంది.

‘‘నేనయినా.. ప్రేక్షకులయినా సినిమా చూడాలా వద్దా అనేది ట్రయిలర్ ను బట్టి.. టాక్ ను బట్టి డిసైడ్ అవుతారు కానీ హీరో చేసిన కామెంట్లను బట్టి కాదని’’ అంటున్నారు నిర్మాత సురేష్ బాబు. కాలా సినిమా తెలుగులో రిలీజ్ చేసిన నిర్మాత ఎన్.వి. ప్రసాద్ కూడా దాదాపుగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాలా సినిమా కలెక్షన్లు డల్ గా ఉండటానికి కారణం ఈ మూవీ యూత్ కు నచ్చకపోవడమే అంటున్నారు. అంతేతప్ప తూత్తుకుడి వివాదంపై రజనీ అభిప్రాయం కారణం కానే కాదంటున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English