బయ్యర్లని వణికిస్తోన్న సూపర్‌స్టార్‌

బయ్యర్లని వణికిస్తోన్న సూపర్‌స్టార్‌

రజనీకాంత్‌ సినిమాకి కూడా నాసి రకం వసూళ్లు వస్తాయా అని ట్రేడ్‌ విస్మయం చెందేలా 'కాలా' చిత్రానికి తెలుగునాట దారుణమైన వసూళ్లు వస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లో ఏడు కోట్ల షేర్‌ కూడా తెచ్చుకోలేకపోయిన కాలా భారీ పరాజయం దిశగా సాగుతోంది. కాలా చిత్రానికి వస్తోన్న ఈ స్పందన చూసి 'రోబో 2.0' చిత్రం హక్కులు తీసుకున్న బయ్యర్లకి వణుకు మొదలైంది.

రజనీకాంత్‌, శంకర్‌ కాంబినేషన్‌ అని చెప్పి '2.0' హక్కుల్ని ఎనభై కోట్లకి పైగా చెల్లించి తీసుకున్నారు. లింగ, కబాలి, కాలా ఫలితాల తర్వాత 2.0 చిత్రానికి థర్డ్‌ పార్టీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశాలు తక్కువే. అసలే 2.0 రిలీజ్‌ ఇప్పటికే బాగా ఆలస్యమైంది. వచ్చే యేడాది వేసవికి గానీ రిలీజ్‌ అవదని చెబుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రంపై పెట్టిన పెట్టుబడికి వడ్డీలు పెరిగి బయ్యర్లకి నడ్డి విరిగిపోతోంది. గట్టిగా మాట్లాడితే ఎక్కడ ఇచ్చిన అడ్వాన్స్‌ని వదులుకోవాల్సి వస్తుందోనని ఎవరూ ఆ చిత్ర బృందాన్ని నిలదీయడం లేదు.

ఈలోగా రజనీకాంత్‌ మార్కెట్‌ బాగా పడిపోయింది. 2.0 చిత్రం ఏమాత్రం అటు ఇటు అయిందనే టాక్‌ వచ్చినా కానీ మునుపటిలా రజనీ మేనియాలో కొట్టుకుపోవడం జరగదు. తెలుగు స్ట్రెయిట్‌ సినిమాలకే టాక్‌ రాకపోతే మినిమమ్‌ వసూళ్లు రావడం లేదిప్పుడు. 2.0 లేట్‌ అవుతోందని కార్తీక్‌ సుబ్బరాజ్‌తో మరో చిత్రాన్ని మొదలు పెట్టిన రజనీకాంత్‌ ఆ చిత్రాన్ని అయినా 2.0 తర్వాతే విడుదల చేస్తాడని బయ్యర్లు ఆశ పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English