అష్టాచెమ్మా వెనుక అసలు కథేంటంటే..

అష్టాచెమ్మా వెనుక అసలు కథేంటంటే..

‘గ్రహణం’ లాంటి ప్రయోగాత్మక చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. ఆ చిత్రం విమర్శకుల ప్రశంసలందుకుంది. అవార్డులూ అందుకుంది. కానీ కమర్షియల్‌గా మాత్రం సక్సెస్ కాలేదు. ఆ తర్వాత ఇంద్రగంటి తీసిన ‘మాయాబజార్’ ఏ రకంగానూ మెప్పించలేదు. ఆయనకు అన్ని రకాలుగా సంతోషాన్నిచ్చిన తొలి సినిమా ‘అష్టాచెమ్మా’. ఈ చిత్రం విమర్శకుల్ని మెప్పించింది. ప్రేక్షకాదరణా పొందింది.

ఈ సినిమా కథ మహేష్ అనే పేరు చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే. అందులో మహేష్ బాబు ప్రస్తావన లెక్కలేనన్ని సార్లు వస్తుంది. తాను ఈ కథ రాయడానికి కూడా మహేషే కారణమని.. రైల్లో అనుకోకుండా ఓ చిన్న పాపను చూసి తనకు ‘అష్టాచెమ్మా’ ఐడియా తట్టిందని ఇంద్రగంటి చెప్పడం విశేషం.

‘సమ్మోహనం’ ప్రి రిలీజ్ ఈవెంట్లో మహేష్ పక్కనుండగా ఈ విషయాన్ని వెల్లడించాడు ఇంద్రగంటి. ఒక రోజు రైల్లో ప్రయాణిస్తుంటే ఒక చిన్న పాప ‘పోకిరి’ సినిమాలోని మహేష్ డైలాగుల్ని పొల్లు పోకుండా చెప్పడం చూసి.. ఆ అమ్మాయి స్ఫూర్తితోనే ‘అష్టాచెమ్మా’ కథ రాసినట్లు చెప్పాడు ఇంద్రగటి. నిజంగానే మహేష్ అనే పేరులో ఒక వైబ్రేషన్. ఉంటుందన్న ఇంద్రగంటి.. సినిమాలో మహేష్ బాబుకు సంబంధించిన విజువల్స్ వేద్దామని చిత్ర బృందంలోని వాళ్లు అన్నప్పటికీ అదేమీ అవసరం లేదని.. మహేష్ అనే పేరు చాలని తాను అన్నట్లుగా ఆయన వెల్లడించాడు.

విజయవాడలో ‘అష్టాచెమ్మా’ ప్రివ్యూ చూసిన ఒక అభిమాని తన దగ్గరికి వచ్చి మహేష్ బాబుతో ఎప్పుడు సినిమా చేస్తారని అడిగాడని.. ఐతే తాను ‘అష్టాచెమ్మా’తోనే మహేష్ బాబుతో పని చేసేశానని చెప్పానన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు