ఐరెన్ లెగ్ శాస్త్రి కొడుకు బాధ వింటే కన్నీళ్లే..

ఐరెన్ లెగ్ శాస్త్రి కొడుకు బాధ వింటే కన్నీళ్లే..

90ల్లో తెలుగు సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగిన కమెడియన్లలో ఐరెన్ లెగ్ శాస్త్రి ఒకరు. ఈవీవీ తీసిన ‘అప్పుల అప్పారావు’.. ‘ఏవండీ ఆవిడ వచ్చింది’.. ‘ఆమె’ లాంటి సినిమాలు శాస్త్రికి చాలా మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆయన్ని బిజీ కమెడియన్ని చేశాయి. ఐతే వరుసగా ఒకే రకమైన క్యారెక్టర్లు చేయడంతో శాస్త్రి కామెడీ జనాలకు మొహం మొత్తేసింది. నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. తర్వాత ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయాడు శాస్త్రి. తర్వాత ఆయన గురించి పట్టించుకున్నవాళ్లే కరవయ్యారు. చివరగా ఆయన గుండెపోటుతో చాలా తక్కువ వయసులోనే చనిపోయినట్లు వార్త వచ్చింది. జీవిత చరమాంకంలో శాస్త్రి ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డట్లు వార్తలొచ్చాయి.

దీని గురించి ఐరెన్ లెగ్ శాస్త్రి తనయుడు ఒక ఇంటర్వ్యూలో బాధాకరమైన విషయాలు చెప్పాడు. తన తండ్రి స్వస్థలం తాడేపల్లి గూడెం అని.. ఆయన ఆర్టిస్టుగా బిజీగా ఉన్న సమయంలో తమ కుటుంబం హైదరాబాద్ కు వచ్చిందని.. కానీ తర్వాత ఆయనకు అవకాశాలు తగ్గిపోవడంతో తమ సొంత ఊరికి వెళ్లిపోవాల్సి వచ్చిందని తెలిపాడు. కొంత కాలం పాటు ఏదైనా సినిమా అవకాశం ఉంటే ఇక్కడికి వచ్చి వెళ్లేవారని.. తర్వాత పూర్తిగా అవకాశాలు ఆగిపోవడంతో తన సొంత ఊరికే శాస్త్రి పరిమితం అయిపోయాడని చెప్పాడు. ఆయన ఒంట్లో కొలెస్ట్రాల్ పెరిగిపోయి అనారోగ్యం పాలయ్యారని.. ఒక రోజు ఆయనకు గుండెలో నొప్పి వచ్చిందని.. ఆ సమయానికి తాను, తన తల్లి హైదరాబాద్‌లో ఉన్నామని.. దీంతో ఆయన తన అక్కకు ఫోన్ చేస్తే ఆమె వచ్చి ఆసుపత్రికి తీసుకెళ్లారని అన్నాడు.

లోకల్ ఆసుపత్రిలో చూపిస్తే తమ వల్ల కాదన్నారని.. పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్తే ఒక్క రోజుకు మించి బతకడం కష్టమని తేల్చేశారని.. అప్పుడు తమకు కబురు పెట్టారని చెప్పాడు. తమ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా రైల్లోనే బయల్దేరాల్సి వచ్చిందని.. తాము తాడేపల్లి గూడేనికి చేరుకునే సమయానికి హృదయ విదారకమైన స్థితిలో ఆయన పార్థివ దేహాన్ని చూడాల్సి వచ్చిందని శాస్త్రి తనయుడు తీవ్ర ఉద్వేగంతో చెప్పాడు. అప్పటికి అంబులెన్స్ లేకపోవడంతో రిక్షాలో మృతదేహాన్ని తరలించారని.. ఆయన నడుం భాగం మాత్రమే రిక్షాలో ఉందని.. తల, కాళ్లు ఇటు అటు బయటికి వేలాడుతున్నాయని.. మీద ఒక గుడ్డ మాత్రం కప్పారని.. అది చూసి తట్టుకోలేకపోయామని చెప్పాడు శాస్త్రి తనయుడు. అప్పటికి తాను చిన్నవాడినే అని.. తన తండ్రికి ఒకప్పుడు ఎంతటి పేరు ప్రఖ్యాతులుండేవన్నది తనకు తర్వాతే తెలిసిందని అతను చెప్పాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు