రంగస్థలం నిర్మాతలు రిస్క చేస్తున్నారా?

రంగస్థలం నిర్మాతలు  రిస్క చేస్తున్నారా?

ఈ వేసవిలో ముందుగా వచ్చిన ‘రంగస్థలం’ అంచనాల్ని మించిపోయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వంద కోట్ల షేర్ తెచ్చినా చాలా గొప్పే అనుకుంటే.. ఏకంగా రూ.125 కోట్ల షేర్‌తో కొత్త నాన్-బాహుబలి రికార్డును నెలకొల్పిందీ చిత్రం. ఈ మధ్య కాలంలో మరే చిత్రానికి లేని స్థాయిలో థియేటర్లలో లాంగ్ రన్ దక్కింది ఈ సినిమాకు ఐదారు వారాల తర్వాత కూడా మంచి వసూళ్లు వచ్చాయి.

అమేజాన్ ప్రైమ్‌లో రిలీజయ్యాక కూడా థియేటర్లలో ఈ చిత్రం బాగా ఆడింది. అమేజాన్‌లో సైతం దీనికి మంచి ఆదరణ దక్కింది. ఇక ఈ చిత్రాన్ని వేర్వేరు భారతీయ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే తమిళం... మలయాళం.. హిందీ.. భోజ్ పురి వెర్షన్లు ఒకదాని తర్వాత ఒకటి రిలీజవుతాయని అంటున్నారు.

ఐతే ‘రంగస్థలం’ నిర్మాతలు ఇంతటితో ఆగకుండా చైనాలోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్న ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం. గత రెండు మూడేళ్లలో భారతీయ చిత్రాలకు చైనాలో ఆదరణ పెరిగింది. ముఖ్యంగా అమీర్ ఖాన్ సినిమాలు అక్కడ ఇరగాడేస్తున్నాయి. ‘భజరంగి భాయిజాన్’.. ‘హిందీ మీడియం’ లాంటి సినిమాలకూ మంచి ఆదరణ దక్కింది. ‘బాహుబలి: ది కంక్లూజన్’ కూడా పర్వాలేదనిపించింది.

ఈ నేపథ్యంలోనే ‘రంగస్థలం’ను అక్కడ రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కానీ ‘బాహుబలి’ని ఎంతో ప్రమోట్ చేసి.. పెద్ద ఎత్తున రిలీజ్ చేసినా దానికి ఆశించిన ఆదరణ దక్కలేదు. మన ప్రేక్షకుల అభిరుచికి తగ్గ అనేకానేక ఆకర్షణలు తోడవడం వల్ల ‘రంగస్థలం’ మనకు ప్రత్యేకంగా అనిపించింది కానీ.. ఇది చైనాకు వెళ్లి సత్తా చాటేంత ప్రత్యేకమైన సినిమానా అంటే సందేహించాల్సిందే. చైనాలో సినిమా రిలీజ్ అంటే మామూలు విషయం కాదు. రిలీజ్ ఖర్చు చాలా అవుతుంది. భారీ వసూళ్లు వస్తే తప్ప లాభాలు రావు. అయినా ‘రంగస్థలం’ను అక్కడ రిలీజ్ చేయాలనుకుంటే అది రిస్కే అవుతుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు