ఆ సినిమా రీమేక్ అట

ఆ సినిమా రీమేక్ అట

తెలుగులో మంచి అభిరుచి ఉన్న దర్శకుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు చంద్రసిద్దార్థ. ప్రతిసారీ ఏదో ఒక విభిన్నమైన కథాంశంతో సినిమా తీసే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ ఆయన కెరీర్లో కమర్షియల్ సక్సెస్‌లు చాలా చాలా తక్కువ.

‘ఆ నలుగురు’ మినహాయిస్తే చంద్రసిద్దార్థ కెరీర్లో నిఖార్సయిన హిట్టు లేదు. ‘మధుమాసం’.. ‘అందరి బంధువయా’ సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి. మిగతావన్నీ పోయాయి. చివరగా ఆయన తీసిన ‘ఏమో గుర్రం ఎగరావచ్చు’ దారుణమైన ఫలితాన్నందుకుంది. ఆ సినిమా తర్వాత మూడేళ్లు విరామం తీసుకుని ఇప్పుడు ‘ఆటగదరా శివ’ అనే సినిమా చేశాడు చంద్రసిద్దార్థ. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కొత్తగా అనిపించింది. ఇందులో ఏదో మ్యాజిక్ కనిపించింది. ఈ సినిమాతో చంద్ర మళ్లీ ఫాంలోకి వస్తాడన్న భావన కలిగించింది.

ఐతే ఈ సినిమా గురించి వెల్లడైన తాజా విషయం ఏంటంటే.. ఇది స్ట్రెయిట్ మూవీ కాదట. కన్నడలో విజయవంతమైన ‘రామ రామ రే’ అనే సినిమా ఆధారంగా చంద్రసిద్దార్థ ఈ చిత్రాన్ని రూపొందించాడట. అతను చేస్తున్న తొలి రీమేక్ మూవీ ఇది. ఈ చిత్రం చంద్రసిద్దార్థ ఇనిషియేట్ చేసింది కూడా కాదు. ‘లింగా’.. ‘భజరంగి భాయిజాన్’ లాంటి భారీ సినిమాలు తీసిన స్టార్ కన్నడ ప్రొడ్యూసర్ అయిన రాక్ లైన్ వెంకటేష్ ‘రామ రామ రే’ సినిమాను తెలుగులో తీయాలనుకుని.. దర్శకుడిగా చంద్రసిద్దార్థను ఎంచుకున్నాడట. ఐతే రీమేకే అయినప్పటికీ ట్రైలర్ చూస్తే సినిమాలో చంద్రసిద్దార్థ టచ్ కూడా కనిపిస్తోంది. ఈ చిత్రంలో చాలామంది తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని నటులే కనిపిస్తున్నారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఒక క్యారెక్టర్ చేశాడు. ఈ నెలాఖరులో రాబోయే ఈ చిత్రం ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు