వర్మ కొత్త సినిమా అనౌన్స్ చేసేశాడోచ్..

వర్మ కొత్త సినిమా అనౌన్స్ చేసేశాడోచ్..

రామ్ గోపాల్ వర్మ నుంచి గత దశాబ్ద కాలంలో ఎన్నో చెత్త సినిమాలొచ్చాయి. ఐతే వర్మ సినిమా ఒకటి విడుదలై ఘోరమైన ఫలితాన్నందుకున్న ప్రతిసారీ ఆయన పనైపోయిందని అందరూ అనుకుంటారు. ఇలాంటి సినిమా తీశాక వర్మను నమ్మి మరో అవకాశం ఇచ్చేదెవరు అన్న డిస్కషన్ నడుస్తుంది. కానీ కొన్ని రోజుల్లోనే వర్మ ఇంకో సినిమా అనౌన్స్ చేస్తాడు. ఇది ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వ్యవహారమే.

ఐతే అక్కినేని నాగార్జున లాంటి స్టార్ హీరోతో తీసిన ‘ఆఫీసర్’ థియేటర్ మెయింటైనెన్స్ ఖర్చులు కూడా వెనక్కి తేని నేపథ్యంలో ఈసారి మాత్రం వర్మకు కష్టమే అని.. ఆయన ఇంకో సినిమా సంపాదించుకోవడం అసాధ్యమని అన్నారు. కానీ వర్మ ఇప్పుడు కూడా ఓ నిర్మాతను మెప్పించాడు. సినిమా తెచ్చుకున్నాడు.

‘వైరస్’ పేరుతో తన కొత్త సినిమా ఉంటుందని ఈ రోజే ప్రకటించాడు వర్మ. కొన్నేళ్ల కిందట ఇండియాను వణికించిన ఎబోలా వైరస్ నేపథ్యంలో ఈ కథ సాగుతుందట. ఇంతకుముందు వర్మతో ‘సర్కార్’.. ‘ముంబయి అటాక్స్’ సినిమాలు తీసిన పరాగ్ సంఘ్వి ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తాడట. ఇది హిందీలో తెరకెక్కుతుందని కూడా వర్మ ప్రకటించాడు. తన సినిమాలు అనౌన్స్ చేసినపుడు ఎప్పుడూ చేసే హడావుడే ఈసారి కూడా చూపించాడు వర్మ. ఈ సినిమా మీద నా నోట్.. ప్రొడ్యూసర్ నోట్ అంటూ ఏవో వివరాలిచ్చాడు.

కాకపోతే వర్మ చాలా ఏళ్లుగా మాటల విషయంలో మాత్రం ఢోకా లేకుండా చూసుకుంటున్నాడు. ఆయన చెప్పేది వింటే ఓ అద్భుతమైన సినిమా చూడబోతున్న భావన కలుగుతుంది. కానీ తీరా సినిమా చూస్తే వెర్రెత్తిపోతుంది. కాబట్టి ‘వైరస్’ గురించి ఆయన ఎంత వివరణ ఇచ్చినా ప్రయోజనం శూన్యం. ఏమైనా సినిమాలో మ్యాజిక్ చేస్తే చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు