ఆ సినిమా తన వల్లే పోయిందన్న చిరు

ఆ సినిమా తన వల్లే పోయిందన్న చిరు

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ మాంచి ఊపుమీదుండగా ఆయనకు పెద్ద బ్రేక్ వేసిన సినిమా ‘స్టూవర్టుపురం పోలీస్ స్టేషన్’. 1991లో విడుదలైన ఈ చిత్రం అంచనాల్ని అందుకోలేకపోయింది. పెద్ద ఫ్లాప్ అయింది. ఈ సినిమా కంటే ముందు క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో చిరు నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టయ్యాయి. ఇది మాత్రం తేడా కొట్టేసింది. ఈ చిత్రం తర్వాత నిర్మాత కె.ఎస్.రామారావుకు, చిరుకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఇద్దరికీ దూరం పెరిగింది. ఐతే ఆ సినిమా ఫ్లాప్ కావడానికి ప్రధాన కారణం తానే అంటూ ఇన్నేళ్ల తర్వాత చిరు ప్రకటించడం విశేషం. కె.ఎస్.రామారావు నిర్మాణంలో తన మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కిన ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో వేడుకలో చిరు ఈ విషయం చెప్పాడు.

‘స్టూవర్టు పురం పోలీస్ స్టేషన్’ కంటే ముందు యండమూరి కథలతో క్రియేటివ్ కమర్షియల్స్ బేనర్లో వరుసగా హిట్లు కొట్టామని.. దీంతో ఈసారి యండమూరికి దర్శకుడిగా అవకాశం ఇద్దామని తాను, రామారావు అనుకున్నామని చిరు వెల్లడించాడు. ఐతే ఈ సినిమా చేయడానికంటే ముందు యండమూరి ‘అగ్నిప్రవేశం’ అనే సినిమాను డైరెక్ట్ చేశారని.. అది ఆడలేదని.. దీంతో ఆయన దర్శకత్వ ప్రతిభ మీద సందేహాలు నెలకొన్నాయన్నారు.

కె.ఎస్.రామారావు కూడా యండమూరితో సినిమా తీసే విషయంలో అనుమానం వ్యక్తం చేసినప్పటికీ తాను వినలేదని.. ఒక ఫెయిల్యూర్‌ను బట్టి నిర్ణయం మార్చుకోకూడదని.. మాటకు కట్టుబడి ఆయనతో సినిమా చేద్దామని అన్నానని.. ఐతే ఆ సినిమా ఆడలేదని చిరు చెప్పాడు. తర్వాత ఓ సందర్భంలో ‘స్టూవర్టుపురం’ ఆడకపోవడానికి తానే పూర్తి బాధ్యుడినని యండమూరి స్వయంగా ప్రకటించారని.. కాబట్టి రామారావు అన్నట్లే మరో దర్శకుడితో ఆ సినిమా చేస్తే ఫలితం వేరుగా ఉండేదేమో అని.. దీనికి సంబంధించిన గిల్ట్ తనను ఇప్పటికీ వెంటాడుతోందని చిరు అన్నాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు