నేచురల్ స్టార్.. బిగ్ డే

నేచురల్ స్టార్.. బిగ్ డే

మూడేళ్ల పాటు అప్రతిహత జైత్రయాత్రతో సాగిపోయిన నేచురల్ స్టార్ నాని.. ఈ మధ్యే బాక్సాఫీస్ దగ్గర చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. అతడి కొత్త సినిమా ‘కృష్ణార్జున యుద్ధం’ తేడా కొట్టేసింది. ఇలాంటి టైంలోనే అతను ఇప్పుడు బుల్లితెరపై పెద్ద పరీక్షకు సిద్ధమయ్యాడు. నాని హోస్ట్ చేయబోతున్న ‘బిగ్ బాస్’ రెండో సీజన్ ఆదివారమే మొదలు కాబోతోంది. ఈ షో తొలి సీజన్ ముంగిట అనేకానేక సందేహాలు నెలకొన్నాయి.

వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ తొలి సీజన్ విజయవంతమైంది. అందుకు సగం కారణం హోస్ట్ జూనియర్ ఎన్టీఆర్. తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో, వాక్చాతుర్యంతో ఆ షోను అద్భుతంగా రక్తి కట్టించాడు తారక్. అతడి ఫ్యాన్ ఫాలోయింగ్, బాక్సాఫీస్ సక్సెస్ కూడా ఈ షోకు బాగా కలిసొచ్చాయి. మిగతా అంశాలు కూడా కలిసొచ్చాయి. షో హిట్టయింది.

ఐతే ఇప్పుడు ఎన్టీఆర్ ప్లేస్‌లోకి నాని వచ్చాడు. రెండో సీజన్‌ను విజయవంతం చేయడం అంత తేలికేం కాదు. గత ఏడాది ‘బిగ్ బాస్’ తెలుగు ప్రేక్షకులకు కొత్త కాబట్టి ప్రతిదీ ఆసక్తికరంగా చూశారు. కానీ ఆల్రెడీ అలవాటైంది కాబట్టి ఆసక్తి తగ్గుతుంది. ఈసారి పార్టిసిపెంట్ల లిస్టు చూస్తే ఏమంత ఎగ్జైట్మెంట్ కలగట్లేదు. పైగా షో నిడివి పెరిగింది. ఇక ఎన్టీఆర్‌ కోసమే షో చూసే డైహార్డ్ ఫ్యాన్ ఫాలోయింగ్ నానికి ఉంటుందా అన్నది సందేహం.

ఇది కాక ఎన్టీఆర్‌‌లాగా తన వాక్చాతుర్యం, స్పాంటేనిటీతో నాని సమ్మోహనపరచగలడా అన్నదీ చూడాలి. నాని కూడా చక్కగా మాట్లాడగలడు. అతడికి ఫ్యామిలీస్, యూత్‌లో ఫాలోయింగ్ ఉంది. ఇవి‘బిగ్ బాస్’కు ఏమేరకు ఉపయోగపడతాయి.. ఇతర ప్రతికూలతల్ని అధిగమించి నాని ఈ షోను ఏమేరకు నిలబెట్టగలడు అన్నది చూడాలి. నాని మీద జనాలు ఏమాత్రం ఆసక్తి ప్రదర్శిస్తారన్నది తొలి రోజు టీఆర్పీ రేటింగ్స్‌ను బట్టే తేలిపోతుంది. ఈ రోజు నాని ఎలా షోను రక్తికట్టిస్తాడన్నది కీలకం. కాబట్టి ఈ బిగ్ డే నానికి ఎలాంటి అనుభవాన్ని మిగులుస్తుందో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English