‘ఎన్టీఆర్’ కోసం కళ్యాణ్‌‌ను తేజ అడిగాడట

‘ఎన్టీఆర్’ కోసం కళ్యాణ్‌‌ను తేజ అడిగాడట

తన తండ్రి జీవిత కథతో తెరకెక్కించబోయే ‘యన్.టి.ఆర్’ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు నందమూరి బాలకృష్ణ. ముందు తేజ దర్శకత్వంలో అనుకున్న ఈ చిత్రం.. అనూహ్య పరిణామాల మధ్య క్రిష్ చేతికి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య కనిపించబోతుండగా.. ఆయన సినీ కెరీర్లో, రాజకీయ జీవితంలో కీలకంగా ఉన్న వివిధ వ్యక్తుల పాత్రల్లో ఎవరు కనిపిస్తారన్న ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇటీవలే కాస్టింగ్ కాల్ కూడా ఇచ్చింది ఈ చిత్ర బృందం. మరి ఏయే పాత్రకు ఎవరు ఎంపికవుతారో చూడాలి. మిగతా పాత్రల సంగతేమో కానీ.. నందమూరి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్కరి పాత్రను ఎవరు చేస్తారని అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినపుడు ఆయన వెన్నంటి ఉంటూ చైతన్య రథాన్ని నడిపించిన నందమూరి హరికృష్ణ పాత్రలో ఆయన తనయుడైన కళ్యాణ్ రామ్ నటిస్తాడని కొందరు.. అతనే ఈ పాత్ర చేస్తే బాగుంటుందని కొందరు అంటున్న సంగతి తెలిసిందే. మరి ఈ విషయంలో కళ్యాణ్‌ రామ్‌కు ఏమైనా ఆఫర్ వచ్చిందా అని అతడినే అడిగితే.. చిత్రమైన సమాధానం ఇచ్చాడు.
‘‘ఏమోనండీ. ఇప్పుడు సమీకరణాలన్నీ మారిపోయాయి కదా? ఇప్పుడేం జరుగుతుందో నాకు తెలియదు. నిజానికి ఇప్పటివరకూ నన్నెవరూ అడగలేదు. ఓసారి తేజ గారు.. ‘బయోపిక్‌లో నువ్వొక రోల్ చేయాలి’ అన్నారంతే. కానీ ఆ పాత్రేమిటన్నది తెలియదు. ఇప్పుడు ఆయన మారిపోయారు కదా’’ అంటూ నర్మగర్భమైన సమాధానం ఇచ్చాడు కళ్యాణ్ రామ్. తేజ ఒకప్పుడు కళ్యాణ్ రామ్‌తో ‘లక్ష్మీకళ్యాణం’ చేసిన సంగతి తెలిసిందే. ఆ పరిచయంతో అతడికి రోల్ ఇవ్వాలనుకున్నాడేమో.

మరి అప్పటికి బాలయ్య ఓకే చేశాడో లేదో తెలియదు. ఇప్పుడు బాలయ్య, క్రిష్‌ ఏం ఆలోచిస్తున్నారో మరి. ఒకప్పుడు బాలయ్య, కళ్యాణ్ రామ్‌ సన్నిహితంగానే ఉండేవారు. కానీ తర్వాత పరిస్థితులు మారాయి. తమ్ముడు ఎన్టీఆర్‌కు దగ్గరయ్యాక బాలయ్య అతడిని దూరం పెడుతున్నట్లు భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు