డైరెక్షన్ చేస్తానంటున్న కమెడియన్

డైరెక్షన్ చేస్తానంటున్న కమెడియన్

కొన్నిసార్లు నటులు డైరెక్టర్లు అయితే.. ఇంకొన్నిసార్లు డైరెక్టర్లు నటులుగా మారుతుంటారు. దర్శకులు అవుదామనుకుని ఇండస్ట్రీలోకి వచ్చి.. అనుకోకుండా నటులుగా మారిన వాళ్లు చాలామందే కనిపిస్తారు ఇండస్ట్రీలో. తాను కూడా ఆ కోవకు చెందిన వాడినే అంటున్నాడు కమెడియన్ ప్రియదర్శి.

‘పెళ్ళిచూపులు’ సినిమాలో అదిరిపోయే కామెడీ పండించి.. తర్వాత ఫుల్ బిజీ అయిపోయిన ప్రియదర్శి.. సినిమాల్లోకి రావడానికంటే ముందు షార్ట్ ఫిలిమ్స్ చేశాడు. స్వయంగా షార్ట్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాడు. ప్రొడ్యూస్ చేశాడు. వాటిలో నటించాడు కూడా. ఐతే సినిమాల్లో నటుడిగా అవకాశాలు రావడంతో అలాగే కొనసాగాడు. ఐతే ఎప్పటికీ తాను నటుడిగానే మిగిలిపోనని అంటున్నాడు ప్రియదర్శి.

ఒకప్పుడు తాను చాలా కథలు రాసుకుని.. స్క్రిప్టులు రెడీ చేసుకుని నిర్మాతల కోసం చాలా తిరిగానని.. సినిమా కష్టాలేంటో తెలిసింది అప్పుడే అని.. తాను కచ్చితంగా భవిష్యత్తులో దర్శకుడిగా మారతానని.. తాను వచ్చిందే ఆ విభాగం నుంచి అని ప్రియదర్శి చెప్పాడు. ఐతే అందుకు ఇంకా చాలా సమయం పట్టొచ్చని అన్నాడు. తన తండ్రి ప్రొఫెసర్ అని.. కాబట్టి తనకు పస్తులుండగాల్సిన అవసరం రాలేదు కానీ.. సినిమా అవకాశాల కోసం మాత్రం చాలానే కష్టపడ్డానని ప్రియదర్శి చెప్పుకొచ్చాడు.

ముందు తన తల్లిదండ్రులు సినిమాల విషయంలో ప్రోత్సహించినప్పటికీ తర్వాత తన కష్టాలు చూసి ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు కదా అని చెప్పారన్నాడు. ఐతే ‘టెర్రర్’ సినిమాలో నటించాక ఇక ఇదే కెరీర్ అని ఫిక్సయ్యానని.. ఆపై ‘పెళ్ళిచూపులు’ సినిమాతో మంచి పేరొచ్చి చేతి నిండా పని దొరికిందని.. ఒకప్పుడు తనకు నో చెప్పిన వాళ్లే ఆ తర్వాత పిలిచి మరీ అవకాశాలు ఇచ్చారని అతను వెల్లడించాడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు