ఎన్టీఆర్.. ఆ కమెడియన్ కలిసిపోయారు

ఎన్టీఆర్.. ఆ కమెడియన్ కలిసిపోయారు

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కు.. కమెడియన్ శ్రీనివాసరెడ్డికి విభేదాలని.. కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ మాట్లాడుకోవట్లేదని.. శ్రీనివాసరెడ్డిని ఎన్టీఆర్ ఉద్దేశపూర్వకంగా పక్కన పెడుతున్నాడని కొంత కాలంగా పరిశ్రమలో ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్ కొత్త సినిమా ‘అరవింద సమేత వీర రాఘవ’లో శ్రీనివాసరెడ్డి కూడా ఓ కీలక పాత్ర పోషిస్తుండగా.. అతడిని చూస్తేనే తారక్ ముఖం తిప్పేసుకుంటున్నాడని.. దీంతో శ్రీనివాసరెడ్డి చాలా ఇబ్బంది పడుతున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి కొన్ని రోజులుగా. ఈ ప్రచారం కొంచెం ఉద్ధృతం కావడంతో దీనికి చెక్ పెట్టాలని ఎన్టీఆర్.. దర్శకుడు త్రివిక్రమ్ ఫిక్సయినట్లున్నారు. ఈ రోజు ముగ్గురూ కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.

అందులో ఎన్టీఆర్.. శ్రీనివాసరెడ్డిని దగ్గరికి తీసుకుంటే.. వెనుక త్రివిక్రమ్ ఉన్నాడు. శ్రీనివాసరెడ్డి చాలా ఉద్వేగంగా కనిపిస్తున్నాడీ ఫొటోలో. ఈ ఫొటోను షేర్ చేస్తూ.. ‘మధురం మధురం ఈ సమయం’ అంటూ వ్యాఖ్య.. స్మైలీ ఇమోజీలు జోడించాడు శ్రీనివాసరెడ్డి. మొత్తానికి ఇంతటితో కథ సుఖాంతం అయినట్లుంది. ఎన్టీఆర్ రేంజికి శ్రీనివాసరెడ్డితో విభేదాలేంటన్న సందేహాలు జనాలకు కలుగుతున్నాయి. కానీ అసలు విషయం ఏంటో మరి. ఐతే స్థాయీ భేదం ఏమీ చూసుకోకుండా ఈ రూమర్లకు చెక్ పెట్టడానికి శ్రీనివాసరెడ్డితో ఫొటో దిగడం ఎన్టీఆర్ పరిణతికి నిదర్శనం. ఇంతటితో ఈ ప్రచారాలకు తెరపడినట్లే. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తి చేసి రెండో షెడ్యూల్ మొదలుపెట్టాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రాన్ని దసరా పండక్కి రిలీజ్ చేయాలన్నది ప్లాన్. త్రివిక్రమ్ మిత్రుడు రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు