రజనీకాంత్.. ఆ పార్టీకి విలనైపోయాడు

రజనీకాంత్.. ఆ పార్టీకి విలనైపోయాడు

సూపర్ స్టార్ రజనీకాంత్ భారతీయ జనతా పార్టీ మద్దతుదారుగా ఒక ముద్ర ఉంది. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోడీతో ఆయన భేటీ కావడం.. తర్వాత కొన్ని సందర్భాల్లో భాజపాకు అనుకూలంగా వ్యవహరించడం వల్ల ఇలాంటి అభిప్రాయాలు కలిగాయి జనాల్లో. రజనీ రాజకీయాల్లోకి వస్తే భాజపాలోనే చేరతాడని.. సొంతంగా పార్టీ పెట్టినా ఆ పార్టీకి మద్దతుదారుగా ఉంటారని భావించారు కానీ ఇప్పుడు ఆయన తీరు చూస్తుంటే ఈ అభిప్రాయాలు మార్చుకోవాల్సి వస్తోంది. భాజపా పట్ల ఆయన వ్యతిరేక వైఖరితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు ‘కాలా’ సినిమా ఒక ఉదాహరణ. ఈ చిత్రంలో రజనీ పాత్రను రావణుడి తరహాలో చిత్రించాడు దర్శకుడు పా.రంజిత్. ముఖ్యంగా పతాక సన్నివేశంలో రజనీని ఆ రకంగా ఎస్టాబ్లిష్ చేసి.. విలన్ నానా పటేకర్‌ను రాముడిలా చూపించాడు.

ఇది భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించింది. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ఈ సినిమా ఉందంటూ ఇప్పటికే గొడవ మొదలైంది. దీనిపై టీవీ ఛానెళ్లలో చర్చలు కూడా మొదలయ్యాయి. దర్శకుడు పా.రంజిత్ తన ఐడియాలజీని సినిమాలో చూపిస్తే దాంతో రజనీకి ఏం సంబంధం అనే వాళ్లూ లేకపోలేదు కానీ.. రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతూ తన ఉద్దేశాల్ని చాటడానికి ‘కాలా’ను ఒక వేదికగా చేసుకున్న రజనీ నిమిత్త మాత్రుడేమీ కాదని.. ఆయన రంజిత్ ఐడియాలజీని ఎండోర్స్ చేశాడని.. తన ఉద్దేశాలు కూడా అవే అని చెప్పకనే చెప్పాడని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ సినిమా చూశాక రజనీ భాజపా మద్దతుదారుగా ఉంటాడన్న ఆలోచనల్ని ఆ పార్టీ నేతలు పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. రజనీని లక్ష్యంగా చేసుకుని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు