‘సమ్మోహనం’ కథ అలా పుట్టింది

‘సమ్మోహనం’ కథ అలా పుట్టింది

ఒక సినిమా కథ రాయాలని కూర్చుంటే.. ఐడియా తట్టకపోవచ్చు. కానీ అనుకోకుండా ఒక ఐడియా వచ్చి అది కథగా మారొచ్చు. చుట్టూ ఉన్న మనుషుల నుంచే పాత్రలు పుట్టొచ్చు. కథ కూడా డెవలప్ కావచ్చు. తన కొత్త సినిమా ‘సమ్మోహనం’ కథ కూడా అలాగే పుట్టిందని అంటున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. కొన్నేళ్ల కిందట ‘గోల్కొండ హైస్కూల్’ సినిమా చేసే టైంలో తనకు పరిచయమైన ఒక వ్యక్తి స్ఫూర్తితో ఈ కథ రాసుకున్నట్లు అతను తెలిపాడు.

తనకప్పుడు పరిచయం అయిన వ్యక్తికి సినిమాలంటే పిచ్చి అని.. అతడికి సినిమాలే లోకమని.. కానీ అతడి కొడుక్కి మాత్రం సినిమాలంటే ఏహ్యభావం ఉండేదని ఇంద్రగంటి తెలిపాడు. వాళ్లిద్దరి పాత్రల్నే డెవలప్ చేసి ‘సమ్మోహనం’ కథ రాసినట్లు చెప్పాడు. సినిమాలో ఆ పాత్రల్ని నరేష్.. సుధీర్ బాబు చేశారని వెల్లడించాడు. నరేష్ పాత్ర కోసం ముందు రావు రమేష్‌తో పాటు ఇంకొందరిని అనుకున్నానని.. చివరికి నరేష్‌ను ఆ పాత్రకు ఎంచుకున్నానని.. ఆయన అద్భుతంగా నటించి మెప్పించారని ఇంద్రగంటి తెలిపాడు.

సినీ పరిశ్రమ ఎలా నడుస్తుంది.. అందులోని వ్యక్తులు ఎలా ఉంటారనే విషయాల్ని ‘సమ్మోహనం’లో వాస్తవికంగా చూపించినట్లు ఇంద్రగంటి చెప్పాడు. సినీ పరిశ్రమలోని వ్యక్తుల వల్లే ఇండస్ట్రీ గురించి బయట చెడుగా మాట్లాడుకుంటున్నారని.. కాబట్టి ఇక్కడుండే మంచితో పాటు చెడును కూడా తన పాత్రల ద్వారా చూపిస్తున్నానని.. ఐతే తనకు తిండి పెడుతున్న పరిశ్రమ గురించి కించపరిచేలా మాత్రం ఈ సినిమా ఉండదని.. ఈ సినిమా చూశాక సినీ పరిశ్రమ.. ఇందులోని వ్యక్తుల పట్ల జనాల అభిప్రాయాలు మారుతాయని ఆశిస్తున్నట్లు చెప్పాడు ఇంద్రగంటి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు