చేతులారా పోగొట్టుకున్న ధనుష్‌

చేతులారా పోగొట్టుకున్న ధనుష్‌

'కబాలి' చిత్రాన్ని భారీ రేట్లకి కొంటే అది తీవ్రంగా నష్టాలు తేవడంతో 'కాలా' చిత్రాన్ని కొనడానికి బయ్యర్లు జంకారు. అయితే శాటిలైట్‌ హక్కులతో సహా తెలుగు రైట్స్‌ ఇచ్చేస్తే ముప్పయ్‌ కోట్లు ఇవ్వడానికి ఒకరిద్దరు ముందుకు వచ్చారు. కానీ ఈ చిత్రం రేంజ్‌ పెద్దదని, తక్కువ అంచనా వేయవద్దని నిర్మాత ధనుష్‌ చెప్పాడు.

కేవలం థియేట్రికల్‌ రైట్స్‌కే ముప్పయ్‌ కోట్లు కావాలని డిమాండ్‌ చేసాడు. అయితే రిస్కు చేయడానికి ఎవరూ సాహసించకపోవడంతో 'కాలా'ని స్వయంగా రిలీజ్‌ చేసుకున్నాడు. మార్కెటింగ్‌ సరిగా జరగకపోవడంతో, లోకల్‌ డిస్ట్రిబ్యూటర్స్‌ లేకపోవడంతో కాలా రిలీజ్‌ అవుతోందనే సంగతి రిజిష్టర్‌ అవలేదు. దీంతో రజనీకాంత్‌ సినిమాకి మామూలుగా వచ్చే ఓపెనింగ్స్‌ రాలేదు. కబాలి చిత్రానికి వచ్చిన దాంట్లో సగం కూడా తొలిరోజు రాకపోవడంతో కాలా గట్టెక్కడం కష్టమని తేలిపోయింది. రెండవ రోజు వసూళ్లు దారుణంగా పడిపోవడంతో ఇక సోమవారం నుంచి పరిస్థితి బాగా క్షీణిస్తుందని ట్రేడ్‌ అంటోంది.

మంచి డీల్‌ వచ్చినపుడు ధనుష్‌ క్లోజ్‌ చేసి వుండాల్సిందని, థియేటర్స్‌ నుంచి తెలుగు వెర్షన్‌కి వచ్చే షేర్‌ పది, పన్నెండు కోట్లకి మించదని అంచనాలున్నాయి. ధనుష్‌ ఈ చిత్రాన్ని సరిగా అంచనా వేసి వుంటే కనీసం పదిహేను కోట్ల నష్టాన్ని తప్పించుకోగలిగే వాడని చెప్పుకుంటున్నారు. కొనడానికి వెళ్లిన బయ్యర్లు మాత్రం దీనిని తప్పించుకోగలిగినందుకు సంతోష పడుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు