చిరు కోసం అమితాబ్ మళ్లీ...

చిరు కోసం అమితాబ్ మళ్లీ...

బిగ్-బి అమితాబ్ బచ్చన్‌ను దక్షిణాదిన నటింపజేయాలని ఎప్పట్నుంచో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ ఆయన మాత్రం ఇటువైపు చూడట్లేదు. ఆ మధ్య నందమూరి బాలకృష్ణ-కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కాల్సిన ‘రైతు’ కోసం అడిగితే నో చెప్పేశారు. దీంతో ఆ ప్రాజెక్టే ఆగిపోయింది. ఐతే మెగాస్టార్ చిరంజీవి ఏం చేశాడో ఏమో కానీ.. తన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలో నటించేందుకు అమితాబ్‌ను ఒప్పించగలిగాడు.

నిజంగా ఈ చిత్రంలో అమితాబ్ నటిస్తాడా అని సందేహించిన వాళ్లకు కొన్ని నెలల కిందటే సమాధానం దొరికింది. బిగ్-బి ఇక్కడికి వచ్చి ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనడమే కాదు. దానికి సంబంధించి కొన్ని ఆన్ లొకేషన్ పిక్స్ కూడా షేర్ చేశాడు. అప్పుడాయన కేవలం రెండు రోజులు మాత్రమే చిత్రీకరణలో పాల్గొన్నాడు. అంతటితో ఆయన పని పూర్తయిందని కూడా అప్పుడు వార్తలొచ్చాయి.

కానీ తాజా సమాచారం ప్రకారం ‘సైరా’ కోసం అమితాబ్ మళ్లీ హైదరాబాద్ వస్తున్నారట. ప్రస్తుతం ఈ చిత్రం కోసం 40 రోజుల పాటు లాంగ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. ఇందులో అమితాబ్‌తో ముడిపడ్డ సన్నివేశాలు కూడా ఉన్నాయట. అమితాబ్ మరోసారి షూటింగ్‌లో పాల్గొంటార.ట ముందు అనుకున్నదాని కంటే అమితాబ్ పాత్రను పొడిగించి.. మరిన్ని రోజులు షూటింగ్‌లో పాల్గొనేలా ఆయన్ని ఒప్పించినట్లు సమాచారం.

ఈ చిత్రంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురువు పాత్రలో అమితాబ్ కనిపించబోతున్నాడు. అమితాబ్ ఈ ప్రాజెక్టులో ఉండటం వల్ల దీన్ని జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున రిలీజ్ చేసుకోవచ్చని చిత్ర బృందం భావిస్తోంది. ఆయన్ని ముందు పెట్టి పెద్ద ఎత్తున ప్రమోషన్లు కూడా చేయాలనుకుంటోంది. ఇందుకోసం బిగ్-బికి భారీగా పారితోషకం ఇస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు