ఆ సినిమాలో సినీ పరిశ్రమపై విమర్శలు

ఆ సినిమాలో సినీ పరిశ్రమపై విమర్శలు

సినీ పరిశ్రమ గురించి బయటి వాళ్లు విమర్శలు గుప్పించడం.. తక్కువగా చూడటం మామూలే. కానీ సినిమా వాళ్లు మాత్రం సినిమాను గొప్పగానే చూస్తారు. గొప్పగానే మాట్లాడతారు. ఐతే వచ్చేవారం విడుదల కాబోయే కొత్త సినిమా ‘సమ్మోహనం’లో మాత్రం సినీ పరిశ్రమపై విమర్శలుంటాయట. ఈ విషయాన్ని ఆ చిత్ర దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణనే స్వయంగా వెల్లడించాడు.

ఈ విషయమై మాట్లాడుతూ.. ‘‘అవును.. నా సినిమాలో సినీ పరిశ్రమపై విమర్శలు గుప్పించాను. కానీ అది సద్విమర్శ. అలాంటి విమర్శ ఎప్పుడూ మంచిదే. దాన్నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు. పరిశ్రమలో చెడు ఉంది. కానీ అందరూ చెడ్డవాళ్లు కాదు. అన్ని చోట్లా ఉన్నట్లే ఇక్కడా మంచి చెడూ రెండూ ఉంటాయి. ఆ రెంటినీ సినిమాలూ చూపించాం. సినీ రంగంపై జనాల్లో తప్పుడు భావన కలగడానికి సినిమా వాళ్లు కూడా కొంత కారణమనేది నా ఫీలింగ్’’ అని కుండబద్దలు కొట్టేశాడు ఇంద్రగంటి.

ఒక సినీ నటికి.. సినిమా వాళ్లంటే పడని ఓ కుర్రాడికి మధ్య నడిచే ప్రేమకథే ‘సమ్మోహనం’. నటిగా అదితిరావు కనిపించనుండగా.. కుర్రాడిగా సుధీర్ బాబు  నటించాడు. ఈ పాత్రకు అదితినే తీసుకోవడానికి కారణం చెబుతూ.. ‘‘సినిమాలో కథానాయికది తెలుగు సరిగా మాట్లాడటం రాని సౌత్ ఇండియన్ నటి పాత్ర. ఆ పాత్రకు ఇక్కడి మూలాలుండి.. మన ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని అమ్మాయి అయి ఉండాలని చూశా. అదితి పర్ఫెక్ట్ అనిపించి తీసుకున్నా’’ అని ఇంద్రగంటి తెలిపాడు. ఈ నెల 15న ‘సమ్మోహనం’ ప్రేక్షకుల ముందుకొస్తున్న సంగతి తెలిసిందే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు