తెలుగు దర్శకుడి చైనా సినిమా

తెలుగు దర్శకుడి చైనా సినిమా

చైనా వస్తువులు ఇండియాలోకి ఈజీగానే వచ్చేస్తాయి కానీ.. ఇండియన్ సరకు చైనాకు వెళ్లడమే కష్టం. ఇండియన్ సినిమాలు చైనా మార్కెట్లోకి వెళ్లడానికి కూడా చాలా ఏళ్లు పట్టాయి. ఈ మధ్యే కొంచెం కదలిక వచ్చి భారత సినిమాలు అక్కడ సత్తా చాటుతున్నాయి. మంచి వసూళ్లు సాధిస్తున్నాయి. బాలీవుడ్ ఫిలిం మేకర్స్ కూడా చైనా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని సినిమాలు చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. విశేషం ఏంటంటే.. ఇప్పుడు ఒక తెలుగు దర్శకుడు చైనాలో సినిమా చేయబోతున్నాడు. ఆ దర్శకుడెవరో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

గత ఏడాది విడుదలైన ‘దేవిశ్రీ ప్ర‌సాద్’ అనే థ్రిల్లర్ మూవీ గుర్తుందా? చచ్చిపోయిన అమ్మాయితో శృంగారంలో పాల్గొనే విచిత్రమైన క్రిమినల్స్ కథతో తెరకెక్కిన ఈ చిత్రం చూసిన వాళ్లకు పెద్ద షాకే ఇచ్చింది. ఈ సినిమాను రూపొందించిన దర్శకుడి పేరు శ్రీ కిషోర్. ఇతను గతంలో ‘స‌శేషం’.. ‘భూ’ అనే  సినిమాలు రూపొందించాడు. ఇప్పుడతను `మై ఇండియ‌న్ బాయ్‌ఫ్రెండ్‌` అనే చైనీస్ చిత్రాన్ని తీయబోతున్నాడు.

చైనా వెళ్లిన ఇండియ‌న్ అబ్బాయికి.. అక్కడ పరిచయమైన చైనీస్ అమ్మాయికి మ‌ధ్య నడిచే ప్రేమకథే ఈ చిత్రమట.  ఇది తన సొంత కథే అంటున్నాడు శ్రీకుమార్. 2012 నుంచి హాంగ్ కాంగ్‌లోనే ఉంటున్నానని, అక్కడే ఓ చైనీస్ అమ్మాయిని కూడా ప్రేమించి పెళ్లిచేసుకున్నానని.. తన కథనే సినిమా స్క్రిప్టుగా మలిచానని.. త్వరలోనే ఈ సినిమా మొదలవుతుందని శ్రీకుమార్ తెలిపాడు. మరి తెలుగులో ఎలాంటి ముద్ర వేయలేకపోయిన శ్రీకుమార్.. చైనీస్ సినిమాతో ఏమాత్రం పేరు సంపాదిస్తాడో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు