టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత

టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత

తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు విపరీతమైన కష్టాల్లో ఉందని చెప్పాలి. కష్టాలు అంటే అవి ఫ్లాపులకి సంబంధించిన మ్యాటర్ కాదు లెండి. ఓ సినిమాకు హీరో ఎంత ముఖ్యమో.. జనాలను ఆకట్టుకునేందుకు హీరోయిన్ కూడా అంతే ఇంపార్టెంట్.

కానీ టాలీవుడ్ ఇప్పుడు దారుణమైన హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటోంది. పక్క భాషల నుంచి లెక్క లేనంత మంది హీరోయిన్లు వచ్చి టాలీవుడ్ లో తిష్ట వేస్తున్నారు. సొంత భాషలో అవకాశాలు వదులుకుని మరీ వరుసగా తెలుగు సినిమాలే చేస్తున్నారు. ఇందుకు కారణం.. ఇక్కడ భారీగా గిట్టుబాటు అయ్యే పారితోషికం. ఈ విషయంలో హీరోయిన్ల డిమాండ్లు మరీ దారుణంగా ఉంటున్నాయట. ఒక సినిమా హిట్ అయితే చాలు.. ఇక కొండెక్కి కూర్చుంటున్నారని తెలుగు ఫిలిం మేకర్స్ వాపోతున్నారు.

ఒక మూవీ ఆడితే రెండో సినిమాకు 50 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. 60 దగ్గర బేరం మొదలుపెట్టి.. 50 దగ్గరో.. 40కి పైనో డీల్ సెట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. పైగా ఈ 40 లక్షలతో లెక్కలు సరిపోవు. వీరికి స్టార్ హోటల్స్ లో బస ఏర్పాటు చేయాలి. వెంట ఉండే మమ్మీ.. మేనేజర్లకు కూడా ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ టికెట్స్.. స్టార్ హోటల్ స్టే.. అన్నీ కలిపి ఓ 15 లక్షల వరకూ చమురు వదులుతోందట. అంటే హీరోయిన్ ఓ 40 తీసుకున్నా.. మొత్తం 50 కి పైనే హీరోయిన్ పేరిట ఖర్చు చేయాల్సి వస్తోందని చెబుతున్నారు.

ఇలా అరువు తెచ్చుకున్న హీరోయిన్లలో మచ్చుకు కూడా మంచి సినిమాలు చేయాలని అనుకునే భామలు కనిపించడం లేదని చెప్పుకుంటున్నారు. ఓ నాలుగు సినిమాలు చేసినా 2 కోట్లు వస్తే చాలు.. లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చని ఐడియా వేసుకుని పక్కాగా అమలు చేస్తున్నారట. రకుల్ ప్రీత్ సింగ్ ఇప్పుడు ఓ సినిమాకు 1.75 కోట్లు తీసుకుంటోందనే సంగతి రీసెంట్ గానే విన్నాం. కాజల్.. తమన్నా లాంటి భామలు కూడా 1.5 నుంచి 2 కోట్ల వరకూ డిమాండ్ చేస్తున్నారు.

ఇదంతా గమనించిన సినిమా పెద్దలు.. టాలీవుడ్ ప్రస్తుత లక్ష్యం హీరోయిన్లను తయారు చేసుకోవడమే అంటున్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయనే ఉద్దేశ్యంతోనే పూజా హెగ్డేకు ఒకేసారి 3 సినిమాల డీల్.. ఒక్కోటి 50 లక్షల చొప్పున మాట్లాడుకున్నారట. బాలీవుడ్ నుంచి వచ్చి ఇక్కడ సినిమాలు చేసి.. క్లిక్ కాని వాళ్లు కూడా కనీసం 25 లక్షలు లేనిదే మాట్లాడడం కూడా లేదట. మరి టాలీవుడ్ కి ఈ హీరోయిన్ల కొరత ఎప్పటికి తీరేనో?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు