పారితోషకం తగ్గింది.. పరువూ పోయింది

పారితోషకం తగ్గింది.. పరువూ పోయింది

రామ్ గోపాల్ వర్మతో మళ్లీ సినిమా సినిమా చేయాలన్న నిర్ణయానికి ఇక తన జీవితాంతం చింతించాల్సి ఉంటుందేమో అక్కినేని నాగార్జున. వర్మతో చేసిన ‘ఆఫీసర్’ ఆయనకు చేసిన డ్యామేజ్ అంతా ఇంతా కాదు. గత పదేళ్లలో వర్మ దర్శకుడిగా ఎంత పతనం అయిపోయాడో తెలిసిందే. ఐస్ క్రీమ్.. 365 డేస్ లాంటి చీప్ సినిమాలు చేసి తన స్థాయి ఎంత పడిపోయిందో చాటిచెప్పాడాయన. ఎందరు వారించినా వినకుండా అలాంటి దర్శకుడితో ‘ఆఫీసర్’ చేశాడు. ఈ సినిమా మొదలయ్యాక వ్యక్తిగా కూడా వర్మ పతనం అయిపోవడంతో ఆ ప్రభావమంతా ‘ఆఫీసర్’ మీద పడింది. దెబ్బకు తెలుగు సినీ చరిత్రలోనే ఏ పెద్ద హీరోకు రాని దారుణాతి దారుణమైన వసూళ్లు ఈ చిత్రానికి వచ్చాయి. రెండో రోజు నుంచే థియేటర్ల రెంట్లు కూడా గిట్టుబాటు కాని పరిస్థితి.

అసలే వరుస ఫ్లాపుల్లో ఉన్న నాగార్జునకు ‘ఆఫీసర్’ ఫలితం మామూలు దెబ్బ కాదు. ఇదేమంత విషయం కాదన్నట్లు నాగ్ ఏదో ఫిలాసఫీ చెప్పేసి ముందుకు సాగిపోతున్నట్లు కవర్ చేశాడు కానీ.. ‘ఆఫీసర్’ ఆయనకు అన్ని రకాలుగా పెద్ద దెబ్బ అనడంలో సందేహం లేదు. ఈ సినిమా ఫలితం విషయంలో వర్మ కంటే నాగార్జుననే ఎక్కువగా తిడుతున్నారు. వర్మ పతనం గురించి తెలిసి తెలిసీ అతడి నమ్మి సినిమా చేసినందుకు ఆయన్నే విమర్శిస్తున్నారు. ‘శివ’తో తన కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన కృతజ్ఞతతో నాగ్.. వర్మకు సినిమా చేశాడేమో తెలియదు కానీ.. ఈ చిత్రానికి రెగ్యులర్‌గా తీసుకునే పారితోషకం కంటే తక్కువగా రూ.3 కోట్లే పుచ్చుకున్నాడట. ఆ రకంగా పారితోషకంలో కోత పడటమే కాక.. పరువు కూడా పోగొట్టుకుని చాలా ఇబ్బందికర స్థితిలో పడిపోయాడు నాగ్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు