మేనల్లుడిని కాపాడే మిషన్ మొదలైంది

మేనల్లుడిని కాపాడే మిషన్ మొదలైంది

మెగాస్టార్ చిరంజీవి వేసిన ఫౌండేషన్ మీద ఆ ఫ్యామిలీకి చెందిన చాలామంది హీరోలు నిలబడ్డారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఆ జాబితాలో సాయిధరమ్ తేజ్ కూడా ఒకడిలా కనిపించాడు. ‘రేయ్’ సంగతెలా ఉన్నప్పటికీ ఆ తర్వాత హ్యాట్రిక్ హిట్లతో స్టార్ ఇమేజ్ సంపాదించాడతను. ఇక కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్తాడని అనుకుంటే.. వరుస ఫ్లాపులతో దబేల్‌మని కింద పడ్డాడు. ఒక్క హిట్.. ఒక్క హిట్ అంటూ ఆశగా ఎదురు చూడాల్సిన పరిస్థితికి చేరుకున్నాడు. కెరీర్ ఆరంభంలో చిరు తేజూకి బాగానే అండగా నిలిచాడు. ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సెట్ కావడంతో ఆయనదే కీలక పాత్ర అంటారు. ఆ సినిమా ఆడియో వేడుకకూ వచ్చాడు చిరు. ఆ తర్వాత ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో వేడుకకూ అతిథిగా హాజరయ్యాడు. దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతకు తేజూను అటాచ్ చేసి ప్రశాంతంగా ఉన్నాడు.

చిరు, రాజు  పట్టించుకోవడం మానేయగానే తేజూ దారి తప్పాడు. వరుసగా ఐదు ఫ్లాపులతో దయనీయమైన స్థితిలో ఉన్నాడిప్పుడు. దీంతో అతడి బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది చిరుకు. మేనల్లుడిని ఆదుకోవడానికి ఆయన ముందుగా అతడి కొత్త సినిమా ‘తేజ్ ఐ లవ్యూ’ ఆడియో వేడుకకు హాజరు కాన్నాడు. ఈ నెల 9న ఈ వేడుక హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ హాల్‌లో జరగబోతోంది. దీని తర్వాత తేజు చేయబోయే ప్రాజెక్టులోనూ మెగాస్టార్ భాగస్వామ్యం ఉందంటున్నారు. చిరు, పవన్ ఇద్దరూ కలిసి తేజుతో సినిమా చేయమని అల్లు అరవింద్‌కు చెప్పారని.. ఆయన ‘పిల్లా నువ్వు లేని జీవితం’ తర్వాత మరోసారి తేజుతో సినిమా నిర్మించబోతున్నాడని.. ప్రస్తుతం కథలు, దర్శకుల వేట సాగుతోందని అంటున్నారు. మరి చిరు హ్యాండ్ పడ్డాకైనా తేజు కెరీర్లో మార్పు వస్తుందేమో చూడాలి.

 
 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English