ఎన్టీఆర్ రెండో కోణం.. ఎలాగబ్బా

ఎన్టీఆర్ రెండో కోణం.. ఎలాగబ్బా

నందమూరి తారక రామారావు జీవిత కథ ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు ఆయన తనయుడు బాలకృష్ణ ప్రకటించడం ఆలస్యం.. రామ్ గోపాల్ వర్మ లైన్లోకి వచ్చాడు. ఎన్టీఆర్ జీవితంలోని మరో కోణాన్ని చూపిస్తూ ‘లక్ష్క్ష్మీస్ ఎన్టీఆర్’ తీస్తానని ప్రకటించాడు. బాలయ్య తీయబోయే సినిమాలో అన్నీ సానుకూలాంశాలు.. జనాలకు తెలిసిన విషయాలే చూపిస్తారని.. కానీ తాను మాత్రం ఎవరికీ తెలియని.. తెలుసుకోవాలని కోరుకునే విషయాలు తన సినిమాలో చూపిస్తానని.. బాలయ్య బయోపిక్ కంటే తనదే ఆసక్తికరమని అప్పట్లో చెప్పుకొచ్చాడు వర్మ.

ఒక దశలో బాలయ్య తీసే సినిమా కంటే ముందు ఇదే మొదలయ్యేలా కనిపించింది. ప్రి ప్రొడక్షన్ వర్క్ జోరుగా సాగింది. ఒక ఇంట్రెస్టింగ్ ప్రి లుక్ కూడా రిలీజ్ చేసి ఆసక్తి రేకెత్తించాడు వర్మ. కానీ ఉన్నట్లుండి ఆ సినిమాకు బ్రేక్ పడింది.

అందుక్కారణం.. నాగార్జునతో వర్మ సినిమా కమిటవ్వడమే. వీళ్లిద్దరి కలయికలో ‘ఆఫీసర్’ పట్టాలెక్కడం.. ఇది తీసినన్నాళ్లూ వేరే ప్రాజెక్టు వైపు చూడొద్దని నాగ్ షరతు పెట్టడం.. అదే సమయంలో నిర్మాత కూడా వెనక్కి తగ్గడంతో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పనులన్నీ ఆపేశాడు వర్మ. ఇప్పుడేమో ‘ఆఫీసర్’ పూర్తయి విడుదలైపోయింది. మరి వర్మ మళ్లీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పని మొదలుపెడతాడా లేదా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ ‘ఆఫీసర్’ ఫలితం చూశాక వర్మతో పని చేయడానికి ఎవరైనా ముందుకొస్తారా అన్నది సందేహంగా మారింది.

నిర్మాతతో పాటు ఇందులో వివిధ పాత్రలకు నటీనటుల్ని ఎంచుకోవడమూ సులువైన విషయం కాదు. ఇన్నాళ్లూ వర్మ ఏవేవో గిమ్మిక్కులు చేసి అందరినీ బుట్టలో వేసేవాడు. తన సినిమాలకు క్రేజ్ కూడా తేగలిగేవాడు. కానీ ‘ఆఫీసర్’ తర్వాత అలాంటి పప్పులు ఉడికే పరిస్థితి లేదు. మరి ఆసక్తి రేకెత్తించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ అటకెక్కినట్లేనా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు