లక్ష్మీస్ ఎన్టీఆర్ కు డబ్బులు తీస్కోలేదట

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు డబ్బులు తీస్కోలేదట

ఓ బయోపిక్ తెరకెక్కించాలంటే.. ఆ వ్యక్తి నుంచి అనుమతి తప్పనిసరి. మరణించిన వారి విషయంలో ఆయా కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. కానీ లివింగ్ పర్సన్ విషయంలో మాత్రం.. బయోపిక్ కోసం కచ్చితంగా ఆ వ్యక్తి అనుమతి ఉండాలని సెన్సార్ నిబంధనలు ఉన్నాయి.

ప్రస్తుతం బయోపిక్స్ సీజన్ బాగా ఊపందుకోగా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఓ సినిమా కూడా అనౌన్స్ అయింది. ఈ సినిమా విషయంలో లక్ష్మీ పార్వతి నుంచి అనుమతి కోసం పెద్ద మొత్తాన్నే పుచ్చుకున్నారనే కథనాలు వచ్చాయి. అయితే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ మేకర్స్ ను తాను ఇప్పటివరకూ కలవలేదని.. కేవలం ఒకసారి మాత్రమే ఫోన్ లో మాట్లాడానని.. ఆ తర్వాత వారితో ఎలాంటి సంప్రదింపులు చేయలేదని చెబుతున్నారు లక్ష్మీపార్వతి. ఈ చిత్రానికి అనుమతి ఇచ్చేందుకు తాను 62 లక్షలు తీసుకుని.. వాటితో ఓ ఫ్లాట్ కొనుక్కున్నట్లు వస్తున్న వార్తలు అన్నీ నిరాధారమైనవే అని ఆమె తేల్చేశారు.

తాను ఒక్క రూపాయి కూడా ఆశించలేదని.. వాస్తవాలను యథాతథంగా చూపిస్తే తనకు లక్ష్మీస్ ఎన్టీఆర్ విషయంలో ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పడం విశేషం. తన గౌరవానికి భంగం కలిగించకుండా స్క్రిప్ట్ రెడీ చేసి.. పూర్తి స్క్రిప్టును తనకు చూపించి.. తాను సంతృప్తి చెందితే మాత్రం.. తన కథ తీసేందుకు అనుమతి ఇచ్చే విషయం ఆలోచిస్తాననన్నారు లక్ష్మీ పార్వతి. ఇప్పటివరకూ అయితే.. తాను ఎవరికీ బయోపిక్ కి అనుమతి ఇవ్వలేదని అన్నారామె.