రజనీ హిట్టన్నాడు.. వాళ్లు ఫ్లాపన్నారు

రజనీ హిట్టన్నాడు.. వాళ్లు ఫ్లాపన్నారు

సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి రెండేళ్ల కిందట వచ్చిన ‘కబాలి’ చిత్రానికి ఎంత హైప్ నెలకొందో తెలిసిందే. దర్శకుడిగా రెండే రెండు సినిమాల అనుభవమున్న పా.రంజిత్ దర్శకత్వంలో రజనీ నటిస్తున్నాడన్నపుడు చాలామంది లైట్ తీసుకున్నారు కానీ.. ఆ చిత్ర టీజర్ రిలీజయ్యాక విపరీతమైన హైప్ వచ్చింది.

విడుదలకు ముందైతే సూపర్ స్టార్ అభిమానులే కాక.. సామాన్య ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి ఆ సినిమాపై. కానీ ఆ అంచనాల్ని అందుకోవడంలో ‘కబాలి’ ఘోరంగా విఫలమైంది. టీజర్లో కనిపించిన ఉత్సాహం సినిమాలో లేకపోయింది. ఆ నీరసాన్ని జనాలు భరించలేకపోయారు. ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా డిజాస్టర్ అయింది. తమిళంలో మాత్రం పర్వాలేదనిపించింది. ఆశ్చర్యకరంగా రజనీ మళ్లీ రంజిత్ దర్శకత్వంలోనే తన తర్వాతి సినిమా చేయడానికీ ముందుకొచ్చాడు.

ఐతే ఇప్పుడు‘కబాలి’ ఎఫెక్ట్ ‘కాలా’ మీద స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ఆశించినంత బజ్ రాలేదు. రజనీ మళ్లీ రంజిత్‌కు అవకాశమిచ్చి తప్పు చేశాడేమో అన్న అభిప్రాయం కలిగింది. కానీ రజనీలో మాత్రం అలాంటి ఫీలింగ్ ఎంత మాత్రం లేనట్లే ఉంది. ఆయన దృష్టిలో ‘కబాలి’ హిట్ అన్నట్లే ఉంది. హైదరాబాద్ వేదికగా జరిగిన ‘కాలా’ తెలుగు వెర్షన్ ప్రి రిలీజ్ ఈవెంట్లో రజనీ మాటలు అలాగే ఉన్నాయి మరి. రంజిత్‌కు తాను అవకాశమిచ్చినపుడు అందరూ ఆశ్చర్యపోయారని.. కానీ ‘కబాలి’ సినిమాను అతనెంత బాగా తీశారో చూశారు కదా అన్నాడు రజనీ. అంటే ‘కబాలి’ గొప్ప సినిమా అని ఆయన ఫీలింగేమో. కానీ ఇదే వేడుకలో మాట్లాడిన నిర్మాత దిల్ రాజు.. దర్శకుడు మారుతి మాత్రం.. ‘కబాలి’ ఫ్లాప్ అన్నట్లుగానే మాట్లాడారు. ‘కబాలి’ నిరాశ పరిచినా కూడా రంజిత్‌కు రజనీ ఛాన్స్ ఇవ్వడం గొప్ప విషయం అన్నట్లుగా వీళ్లిద్దరూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలతో ఇటు రజని.. అటు రంజిత్ ఇద్దరూ ఇబ్బంది పడే ఉంటారు మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు