చిరు.. నాగ్.. వెంకీ.. బాలకృష్ణ.. ఒక్కొక్కరే -రజినీ

చిరు.. నాగ్.. వెంకీ.. బాలకృష్ణ.. ఒక్కొక్కరే -రజినీ

రజినీకాంత్ కొత్త సినిమా కాలా మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేస్తోంది. ఈ నెల 7న విడుదల కాబోతోన్న కాలాపై అంతగా బజ్ ఏర్పడలేదు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అంతగా జరగడం లేదు. దీంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ పేరుతో ఓ ఫంక్షన్ ఏర్పాటు చేశారు మేకర్స్. ఈ వేడుకలో రజినీకాంత్ మాటలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందరు స్టార్ హీరోల ఫ్యాన్స్ ను ఉర్రూతలు ఊగించాయి.

'1978లో అంతులేని కథ అంటూ తొలిసారి తెలుగు సినిమా చేశాను. ఆ తర్వాత 15 వరకూ తెలుగు సినిమాల్లో నటించాను. ఆ తర్వాత కొంతకాలం తెలుగులో నేరుగా చేయలేదు. ఏ ఇండస్ట్రీపై కాన్సంట్రేట్ చేసేదా అనే మీమాంశలో ఉన్నపుడు నాకు నటుడిగా జన్మను ఇచ్చిన తమిళ్ లోనే కొనసాగాలని నిర్ణయించుకున్నాను. అయితే నాపై తమిళ ప్రేక్షకులు ఎంత ప్రేమ చూపుతున్నారో తెలుగు ఆడియన్స్ కూడా చూపడం నా భాగ్యం. చాలాకాలం గ్యాప్ తర్వాత పెదరాయుడుతో మళ్లీ మోహన్ బాబు నాకు బ్రేక్ ఇచ్చారు' అన్నారు రజినీకాంత్.

'పెద్ద ఎన్టీఆర్ ఉన్నపుడు హైద్రాబాద్ వచ్చినపుడల్లా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాడిని. ఇప్పుడు ఆయనను మిస్ చేసుకున్నాను.. ఆయన గుర్తొస్తున్నారు. ఎందుకో మీకు తెలుసు. అలాగే నా గురువు బాలచందర్ నన్ను తన బిడ్డలా ప్రేమించారు. ఆయన ఇప్పుడు లేరు. ముందు మాట్లాడిన వక్తలు ఒకే రజినీకాంత్ అని చెప్పారు. ఒకే చిరంజీవి.. ఒకే నాగార్జున.. ఒకే బాలకృష్ణ.. ఒకే వెంకటేష్.. అందరూ ఒక్కొక్కరే ఉంటారు.. ఎవరి ఇండివిడ్యువాలిటీ వారికి ఉంది. అందరూ సమానమే' అని రజినీకాంత్ చెప్పడంతో.. ఆడిటోరియం దద్దరిల్లిపోయింది.

'మనకు వచ్చే అవకాశం పెద్దది చేస్తుందంతే. ఆ అవకాశం ఉపయోగించుకోవాలి. దేవుడి మీద నమ్మకం లేని వారు అదృష్టం అంటారు. ఉన్నవాళ్లు ఆశీర్వాదం అంటారు. ఏ ప్రొఫెషన్ అయినా.. అవకాశం దొరికితే దాన్ని వదులుకోకూడదు. దేవుడిచ్చిన అవకాశాన్ని కష్టపడి శ్రమిస్తే.. తగిన ఫలితం లభిస్తుంది' అన్న సూపర్ స్టార్ 'నా గత చిత్రం కబాలి. అఫ్పుడు నేనిక్కడ లేను. అమెరికాలో ఉన్నాను. పా రంజిత్ లాంటి చిన్న దర్శకుడికి రజినీకాంత్ అవకాశం ఇవ్వడమేంటి అనుకున్నారు. ఆయన చెప్పిన నెరేషన్ అంత గొప్పగా ఉంది. మీరు కబాలి చూసి ఉంటారు. సినిమా బాగా తీశారు. అది చూసిన తర్వాత.. నా అల్లుడు ధనుష్.. నిర్మాత ఈ కాలా చిత్రానికి శ్రీకారం చుట్టారు' అన్నారు.

'ఇప్పుడు నేను కథ చెప్పకూడదు. నా పిక్చర్ ను నేనే పొగుడుకోవడం సరికాదు. కమర్షియల్ గా చెప్పడం లేదు. మంచి మెసేజ్ ఉంటుంది. రంజిత్ స్టైల్ ఏంటంటే.. కమర్షియల్ పిక్చర్ ను ఆర్టిస్టిక్ స్టైల్ లో రియాలిటీని బాగా మిక్స్ చేస్తారు. ఏషియాలో అతి పెద్ద స్లమ్ ధారావి. ఆ స్లమ్ లో ఉన్న వారి జీవితం ఏంటి.. ఎలాంటి కష్టాలు ఉంటాయి. మీరు కాలా సినిమా చూస్తే.. మీరు వారితో నివసిస్తున్న ఫీలింగ్ వస్తుంది. సహజంగా ఓ సినిమాలో హీరో పాత్ర బాగుంటుంది. ఏదో ఒక పాత్ర బాగుంటుంది. కానీ కాలాలో మాత్రం ఐదారుగురు పాత్రలు.. మనకు ఇంటికి వచ్చాక కూడా గుర్తుంటాయి' అన్నారు సూపర్ స్టార్.

'చాలా బాగా ఎమోషనల్ మూవీ.. స్లమ్ పీపుల్ ఎలా ఉంటారు అనే విషయాన్ని ఈ సినిమాలో బాగా చూపించారు. నేను కాలా చూశాను. రంజిత్ గారు చాలా కష్టపడి చేశారు. సంతోష్ నారాయణ్ చాలా మంచి క్లాస్ మ్యూజిక్ అందించారు. మీ తెలుగు అమ్మాయి ఈశ్వరీ రావు పెర్ఫామెన్స్ చాలా బాగుంటుంది. హ్యుమా ఖురేషి కూడా మంచి పాత్ర పోషించింది. ధనుష్ గారు కూడా ఈ పిక్చర్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారో అనుకున్నాను. కానీ తను మంచి యాక్టర్ మాత్రమే కాదు.. మంచి ప్రొడ్యూసర్ కూడా అని ఆయన నిరూపించుకున్నారు' అంటూ తన అల్లుడిని.. తెలుగులో రిలీజ్ చేస్తున్న ప్రొడ్యూసర్లను ప్రశంసించారు రజినీ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English