రానా దగ్గుబాటి కొత్త సినిమా.. అరణ్య

రానా దగ్గుబాటి కొత్త సినిమా.. అరణ్య

‘బాహుబలి’ సినిమాతో దేశవ్యాప్తంగా తిరుగులేని పేరు సంపాదించాడు రానా దగ్గుబాటి. ఈ చిత్రం అతడి స్థాయిని ఎంతో పెంచింది. బహు భాషల్లో అతడికి ఫాలోయింగ్, అవకాశాలు తెచ్చిపెట్టింది. తెలుగుతో పాటు హిందీ.. తమిళంలో అతను అవకాశాలు అందుకున్నాడు. రానా ప్రతి సినిమా కూడా  మూణ్నాలుగు భాషల్లో విడుదలవుతోంది. అతడితో బహు భాషా చిత్రాలు తీస్తున్నారు ఫిలిం మేకర్స్. ‘ఘాజి’ ఆ కోవలోనే మూడు భాషల ప్రేక్షకుల్ని మెప్పించింది. రానా ఇప్పుడు మరో త్రిభాషా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తమిళంలో వైవిధ్యమైన సినిమాలు తీసిన ప్రభు సాల్మన్ దర్శకత్వంలో రానా ఒక సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. రాజేష్ ఖన్నా ‘హాథీ మేరీ సాథీ’ స్ఫూర్తితో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచస్ మూవీకి టైటి్ల కూడా నిర్ణయించారు.

తెలుగులో ఈ చిత్రానికి ‘అరణ్య’ అనే టైటిల్ ఖరారు చేశారు. తమిళంలో ‘కాడన్’ అనే పేరు పెట్టాడు దర్శకుడు. ఈ రెండు టైటిళ్లకూ అడవి అనేదే అర్థం. హిందీలో ‘జంగిల్’ అని పెడతారా.. ఇంకేదైనా పేరు ఎంచుకుంటారా అన్నది చూడాలి. ఈ సినిమా అంతా అటవీ నేపథ్యంలోనే సాగుతుందట. మనిషికి అడవికి ఉన్న అనుబంధాన్ని ఇందులో చూపిస్తారట. రానాను టార్జాన్ తరహాలో చూపిస్తారట ఈ చిత్రంలో. ప్రభు సాల్మన్ ఏ సినిమా తీసినా అడవితో టచ్ ఉండేలా చూసుకుంటాడు. ప్రకృతిని చాలా బాగా చూపిస్తాడతను. ప్రభు తీసిన ‘గజరాజు’లో హీరో మావటి వాడన్న సంగతి తెలిసిందే. మరి రానా ఈ చిత్రంలో ఎలా కనిపిస్తాడో.. మెప్పిస్తాడో చూడాలి. చిత్రీకరణ మధ్య దశలో ఉందిప్పుడు. ఈ చిత్రాన్ని ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తేవాలని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు